నోటీసులు దగ్ధం

కనీస వేతనం

కోటబొమ్మాళి : నోటీసులను దగ్ధం చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు

* 24వ రోజుకు అంగన్వాడీల సమ్మె

* శ్రీకాకుళంలో నేడు ఎం.వి పద్మావతి ఇళ్లు ముట్టడి

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారానికి 24వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా పలురూపాల్లో నిరసనలు తెలిపారు. కోటబొమ్మాళి, కొత్తూరులో విధులకు హాజరు కాకుంటే చర్యలు తీసుకుంటామని అధికారులు ఇచ్చిన నోటీసులను అంగన్వాడీలు దగ్ధం చేశారు. భయపెడితే బెదిరేది లేదని, సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుధ స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు హెచ్‌.ఈశ్వరరావు, యూనియన్‌ నాయకులు హేమలత, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో అంగన్వాడీలను బెదిరిస్తూ కేంద్రాలను బలవంతంగా తెరిపిస్తున్న ఎం.వి పద్మావతి నివాసాన్ని శుక్రవారం ముట్టడిస్తామని యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి తెలిపారు. కార్మికుల మధ్య చీలిక తెచ్చి పబ్బం గడుపుకోవాలని చూస్తే సహించేది లేదన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా బెదిరింపులకు పాల్పడితే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అర్బన్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఒంటి కాలిపై నిల్చొని నిరసన తెలిపారు. ఐద్వా నాయకులు శ్రీదేవి పాణిగ్రహి, సిఐటియు నాయకులు వెంకటరావు పాణిగ్రాహి కార్మిక చట్టాలు, సమ్మె హక్కుపై వివరించారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు టి.రాజేశ్వరి, కె.ప్రమీలాదేవి తదితరులు పాల్గొన్నారు. పలాసలో కాశీబుగ్గ ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని ఎల్‌ఐసి యూనియన్‌ నాయకులు ఎం.హరనాథ్‌ శ్రీనివాస్‌ పి.రాంబాబు తదితరులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌ గణపతి, సిపిఎం నాయకులు బమ్మిడి ఆనందరావు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు ఎం.మంజుల, బి.సునీత తదితరులు పాల్గొన్నారు. టెక్కలి, ఆమదాలవలసలో ప్రాజెక్టు కార్యాలయాల వద్ద, ఇచ్ఛాపురంలో బస్టాండ్‌ కూడలి వద్ద సమ్మె శిబిరంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు బి.రమణమ్మ, బి.ఆదిలక్ష్మి సిహెచ్‌.ఇందుమతి, పి.లతాదేవి, పి.భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పొందూరులో కార్మిక చట్టాలు, సమ్మె హక్కులను సిఐటియు సీనియర్‌ నాయకులు కె.శ్రీనివాసు వివరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు జ్యోతిలక్ష్మి, ఎస్‌.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️