పంచాయతీల నిధులు దారిమళ్లింపు

పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన

సమావేశంలో మాట్లాడుతున్న రాజేంద్రప్రసాద్‌

  • ఉత్సవ విగ్రహాలుగా సర్పంచ్‌లు
  • రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించిందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్‌ ధ్వజమెత్తారు. నగరంలోని ఒక హోటల్‌లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనివల్ల గ్రామాల్లో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్లు, గృహ సారథులకు అధికారాలను కట్టబెడుతూ సర్పంచ్‌ల హక్కులను కాలరాస్తూ వారిని ఉత్సవ విగ్రహాలుగా మార్చేసిందన్నారు. వైసిపి ప్రభుత్వం పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. పంచాయతీలు, సర్పంచ్‌లకు సంబంధించిన 16 డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నామని చెప్పారు. రాజకీయాలకతీతంగా సర్పంచ్‌లందరూ ఏకమై ఉమ్మడిగా ఉద్యమిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు గొండు శంకర్‌ మాట్లాడుతూ పంచాయతీరాజ్‌ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికల్లో పంచాయతీల ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సమావేశంలో పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ ఉపాధ్యక్షులు ఆనెపు రామకృష్ణ, వై.వినోద్‌ రాజు, చుక్క ధనుంజరు, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

 

➡️