పకడ్బందీగా ఎన్నికల నియమావళి

రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి జిల్లాలో ఎన్నికల

మాట్లాడుతున్న జెడ్‌పి సిఇఒ వెంకటేశ్వరరావు

జెడ్‌పి సిఇఒ వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని జిల్లా పరిషత్‌ ముఖ్యకార్య నిర్వహణ అధికారి డి.వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో శనివారం ఎంసిసి నోడల్‌ అధికారులు, జిల్లా స్థాయి మాస్టర్‌ ట్రైనీలు, ఎంపిడిఒలు, అన్ని మండలాల స్టేషన్‌హౌస్‌ ఆఫీసర్లతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ఫిర్యాదులు, మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ, సి-విజిల్‌, సువిధ తదితర అంశాలపై మొదటి దశ శిక్షణా సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కోసం ఫ్లయింగ్‌ స్వాడ్‌, స్టాటిక్‌ సర్వేయలెన్స్‌, వీడియో సర్వేయలెన్స్‌, వీడియో వీయింగ్‌, అకౌంటింగ్‌ బృందాలు, ఖర్చుల పరిశీలకులను జిల్లాలలోని ఆయా నియోజకవర్గాల వారిగా ఏర్పాటు చేశామన్నారు. రిటర్నింగ్‌ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ… ఎన్నికల విధులు కేటాయించబడిన సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల నుంచి వచ్చే ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను తప్పనిసరిగా లిఖిత పూర్వక సమాధానం అందించాలని, ఎన్నికల ప్రచార సంబంధిత సమావేశాలు, ర్యాలీలు, సభలు నిర్వహించుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల నుంచి సువిధ యాప్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో వచ్చే దరఖాస్తులను పరిశీలించి ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి ఎప్పటికప్పుడు అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె.చెన్నకేశవ రావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో వినియోగించే ఆడియో, వీడియోలను పరిశీలించి ఎంసిఎంసి (మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మోనిటరింగ్‌ కమిటీ) ధ్రువీకరించాలన్నారు. అలాగే ఎలక్ట్రానిక్‌ రూపంలో వచ్చే ప్రకటనలకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. అలాగే పెయిడ్‌ న్యూస్‌ విషయంలో ఎంసిఎంసి కమిటీ ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిర్దేశాలకు అనుగుణంగా పనిచేస్తుందన్నారు. సోషల్‌ మీడియా, ఇ-పేపర్లు, కేబుల్‌ నెట్‌వర్క్‌తో సహా టివి, రేడియో ఛానెల్‌లు, ఆడియో-వీడియో డిస్‌ప్లేలు, సినిమా హాళ్లు, ఇంటర్నెట్‌ ఆధారిత మీడియా, వెబ్‌సైట్‌ల ద్వారా ప్రసారమయ్యే రాజకీయ ప్రకటనలను మీడియా సర్టిఫికేషన్‌ మానిటరింగ్‌ కమిటీ పర్యవేక్షిస్తుందని చెప్పారు. ఎన్నికల సమయంలో నిర్వహించే తనిఖీల్లో నగదు, బంగారం సీజ్‌ చేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలపై క్షేతస్థాయి అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. నగదు సీజ్‌ చేసే సమయంలో సంబంధిత వ్యక్తులకు సీజ్‌ చేస్తున్న నగదు, బంగారం వివరాలు, అప్పీల్‌ చేయాల్సిన అంశాలను తెలియజేస్తూ రశీదు తప్పనిసరిగా అందించాలని ముఖ్య ప్రణాళిక అధికారి ప్రసన్నలక్ష్మి తెలిపారు. సీజ్‌ చేసిన బంగారం, నగదు రూ.పది లక్షల కంటే తక్కువ విలువైదని అయితే వెంటనే జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌నకు అప్పగించాలన్నారు. రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు సీజ్‌ చేస్తే ఐటి అధికారులకు అప్పగించాలని తెలిపారు. ఎన్నికల సమయంలో సీజ్‌ చేయబడిన నగదు, బంగారం, మద్యం, ఇతర విలువైన ఆభరణాల గురించి మీడియాకు సమాచారం అందించాలన్నారు. సంబంధిత వ్యక్తులు చేసిన అప్పీల్‌ అనంతరం విడుదల చేసే నగదు వివరాలు సైతం అందించాలని, సంబంధిత వివరాలతో నిర్ణీత నమూనాలో నివేదిక సమర్పించాలని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ డిప్యూటీ సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌, ట్రైనింగ్‌ మేనేజ్‌మెంట్‌ ఎన్‌.బాలాజీ పాల్గొన్నారు.

 

➡️