‘పది’ పరీక్షా కేంద్రం వద్ద డిజె

పట్టణంలో జూనియర్‌ కళాశాల మైదానం నుంచి నిర్వహించిన ఎన్నికల అవగాహన

పరీక్షా కేంద్రం వద్ద ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

ఇబ్బందులకు గురైన విద్యార్థులు

144 సెక్షన్‌ నిబంధనలకు తూట్లు

ప్రజాశక్తి- ఆమదాలవలస

పట్టణంలో జూనియర్‌ కళాశాల మైదానం నుంచి నిర్వహించిన ఎన్నికల అవగాహన బైక్‌ ర్యాలీ పట్ల అధికారులు వ్యవహరించిన తీరు పట్ల పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేసారు. శనివారం రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ ఎం. నవీన్‌ పాల్గొనే బైక్‌ ర్యాలీ జూనియర్‌ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైంది. ర్యాలీకి ముందు బిఎల్‌ఒలు, రెవిన్యూ అధికారులు సుమారు 40 నిమిషాల ముందే ద్విచక్ర వాహనాలతో ఇక్కడకు చేరుకున్నారు. డిజె సౌండ్‌ సిస్టం వాహనం, డప్పులు కొట్టే కళాకారుల మినీ లారీ మైదానానికి చేరుకున్నాయి. మైదానం పక్కనే 80 మీటర్ల దూరంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు పదో తరగతి పరీక్షలు 143 మంది విద్యార్థులు రాస్తున్నారు. అధికారులు వారిని పట్టించుకోకుండా డిజెలు, డప్పుల మోతలతో సుమారు 30 నిమిషాల వరకు పెద్దపెద్ద శబ్దాలతో దద్దరిల్లించారు. దీంతో పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు పరీక్షలు రాయడం మానేసి కళాశాల మైదానం వైపే దృష్టిని కేంద్రీకరించారు. పరీక్షా కేంద్రం బయట ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సంఘటనతో నివ్వెరపోయి ఆందోళనకు గురయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ అధికారులు కూడా రాజకీయ నాయకులుగా మారారని, పక్కనే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరుగుతున్నప్పటికీ వారు కనీసం పట్టించుకోకుండా డిజె, డప్పుల శబ్దాలతో మారుమోగించడం శోచనీయమని అధికారుల తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు. శనివారం ఫిజికల్‌ సైన్స్‌ పరీక్షను పిల్లలు రాస్తున్నారని, 50 మార్కుల ప్రశ్నాపత్రం కావడంతో రెండు గంటలు మాత్రమే కాలవ్యవధి ఉంటుందని అందులో సుమారు 30 నుండి 40 నిమిషాలు విద్యార్థుల సమయం వృధా అయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు ఇక్కడ పరీక్షా కేంద్రం ఉన్నట్లు తెలియకపోవచ్చునని, స్థానిక అధికారులకు ఏమైందని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి పరీక్షా కేంద్రం పరిధిలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, ఈ విషయం కూడా అధికారులకు తెలియక పోవడం శోచనీయమని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఇటువంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

 

➡️