పావనమూర్తికి పాలాభిషేకం

వెలుగులరేడు సూర్యనారాయణస్వామి రథసప్తమి (జయంత్యుత్సవం) వేడుకలు అంగరంగ వైభవంగా

విద్యుద్దీప వెలుగుల్లో అరసవల్లి ఆలయం

ప్రారంభమైన రథసప్తమి వేడుకలు

క్యూలైన్లలో బారులు తీరిన యాత్రికులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

వెలుగులరేడు సూర్యనారాయణస్వామి రథసప్తమి (జయంత్యుత్సవం) వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం అర్ధరాత్రి 12.10 గంటలకు సుప్రభాత సేవ, ఉష:కాలార్చనతో వేడుకలు మొదలయ్యాయి. క్షీరాభిషేకం వేడుకలను కనులారా చూసేందుకు రాత్రి పది గంటల నుంచే ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లలో యాత్రికులు బారులు తీరారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణ, ఒడిశా నుంచి యాత్రికులు చేరుకున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు జిల్లా నలుమూలల నుంచి సందర్శకులు భారీగా తరలివచ్చారు. దేవాదాయశాఖ రీజన్‌ జాయింట్‌ కమిషనర్‌ విజయకుమార్‌ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో తయారు చేసిన పంచామృతం, సుగంధ ద్రవ్యాలతో మూలవిరాట్టుకు క్షీరాభిషేకం చేశారు. స్వామి వారిని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం ఆరు గంటలకు నిజరూప దర్శనం ప్రారంభం కానుంది. కార్యక్రమంలో ఉత్సవ ప్రధాన అధికారి ఎం.వి.సురేష్‌బాబు పాల్గొన్నారు. నాలుగు స్లాట్లుగ దర్శన సమయం విభజరథసప్తమి వేడుకల్లో క్షీరాభిషేకం ప్రధాన ఘట్టం. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు పెద్దసంఖ్యలో విఐపిలు, వివిఐపిలు తరలివస్తారు. వారికి గతంలో ఉచిత పాస్‌లను జారీ చేసేవారు. అందుకు భిన్నంగా ఈసారి ఉచిత పాస్‌లను రద్దు చేశారు. వాటి స్థానంలో రూ.500 టిక్కెట్లను గతేడాది నుంచి ప్రవేశపెట్టారు. ఈ టిక్కెట్లు కొన్న వారికి క్షీరాభిషేకం, నిజరూప దర్శనం, అర్చనానంతర దర్శనం, పవళింపు సేవల్లో ఎప్పుడైనా వెళ్లేందుకు వీలుండేది. ఈసారి అలా కాకుండా టైం స్లాట్‌లను టిక్కెట్లపై ముద్రించి విక్రయించారు. యూనియన్‌ బ్యాంకు పరిధిలో వీటి అమ్మకాలు చేపట్టారు. ఆర్‌డిఓ కార్యాలయం నుంచి అనుమతి లేఖ తెచ్చుకున్న వారికే నిర్దేశించిన ప్రకారం టిక్కెట్లు విక్రయించారు. అయితే మొదటి టైం స్లాట్‌ టిక్కెట్లను తమకు అనుకూలమైన వారి కోసం బ్లాక్‌ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

➡️