పెగ్గేదేలే…

పాత సంవత్సరానికి వీడ్కోలు
  • న్యూ ఇయర్‌ వేడుకల్లో భారీగా మద్యం విక్రయాలు
  • డిసెంబర్‌ 31న ఒక్కరోజే రూ.6.04 కోట్లు అమ్మకాలు

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే ఉత్సవాల్లో మందుబాబులు మంచి కిక్‌ పొందారు. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు సాగాయి. ఏడాది చివరి రోజైన డిసెంబర్‌ 31న మందుబాబుల కోసం అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతివ్వడంతో మద్యం ప్రియులు ఎక్కడా తగ్గలేదు. ఏడాదంతా తాగింది ఒక్క లెక్క, డిసెంబర్‌ 31న తాగింది మరో లెక్క అనుకున్నారు. దీంతో మందుబాబులు ఫుల్లుగా తాగేసి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానం పలికారు. ఆ స్థాయిలోనే కొనుగోలు చేశారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు కాసులు కురిపించాయి. అటు మందు, మాంసం, కేక్‌లు, స్వీట్లు, ఫ్రూట్స్‌ కోసం జనం భారీగా వెచ్చించారు. ముఖ్యంగా మందుబాబులకు అడ్డే లేకుండా పోయింది. సాయంత్రం ఆరు గంటల నుంచే మద్యం దుకాణాల వద్ద క్యూ కట్టారు. కొంతమంది ముందే సరుకు తెచ్చుకుని దాచుకున్నారు. జిల్లాలో 192 మద్యం షాపులు, 23 బార్లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో సుమారు రూ.3.50 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయి. డిసెంబరు 31న రూ.6.04 కోట్ల మద్యం విక్రయాలు సాగాయి. గతేడాది రూ.5.86 కోట్ల అమ్మకాలు సాగాయి. సాధారణంగా ప్రతి ఏడాది బీర్ల అమ్మకాలు ఎక్కువగా సాగుతాయి. ఈసారి మాత్రం బీర్ల అమ్మకాలను ఐఎంఎల్‌ అమ్మకాలు వెనక్కి నెట్టాయి. ఈ ఏడాది డిసెంబరు 31న బీరు 2,804 కేసులు, ఐఎంఎల్‌ 6,535 కేసులు అమ్ముడుపోయాయి. గతేడాదితో పోలిస్తే రూ.18 లక్షల మేర ఆదాయం ప్రభుత్వానికి అదనంగా సమకూరింది.

➡️