పోలింగ్‌ కేంద్రాలు తనిఖీ

కాశీబుగ్గ ఉన్నత పాఠశాలలో

ఆర్‌డిఒ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి – పలాస

కాశీబుగ్గ ఉన్నత పాఠశాలలో పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ బుధవారం పరిశీలించారు. పలాస ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ, స్ట్రాంగ్‌రూమ్‌ను పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. కాశీబుగ్గ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పలాస తహశీల్దార్‌, ఆర్‌డిఒ కార్యాలయాన్ని సందర్శించి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీలో జాప్యంపై అధికారులను ప్రశ్నించారు. కిడ్నీ పరిశోధనా కేంద్రం, 200 పడకల ఆస్పత్రిని పరిశీలించి అందిస్తున్న వైద్య సేవలు, సమస్యలపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అల్లు పద్మజను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి రక్షణ గోడ లేదని, పూర్తిస్థాయిలో పరికరాలు, వైద్యులు లేరని, శ్రీకాకుళం నుంచి కొంతమంది వైద్యులు డెప్యుటేషన్‌పై వస్తున్నారని తెలిపారు. పూర్తి వివరాలను నివేదిక రూపంలో అందించాలని కలెక్టర్‌ చెప్పారు. కాశీబుగ్గలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని సందర్శించి మున్సిపాల్టీ పరిధిలో టిడ్కో ఇళ్లు, జగనన్న ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు చేయడంలో జాప్యానికి గల కారణాలను మున్సిపల్‌, రెవెన్యూ, మండల పరిషత్‌ అధికారులకు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ, పలాస మండలం వెనుకబడి ఉందని, త్వరితగతిన రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్‌డిఒ భరత్‌ నాయక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్ర కుమార్‌, ఎంపిడిఒ మెట్ట వైకుంఠరావు, తహశీల్దార్‌ ఎస్‌.వి.వి.ఎస్‌ నాయుడు తదితరులున్నారు.

➡️