ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువు

రాష్ట్రంలో ఉపాధ్యాయ, విద్యారంగ

మాట్లాడుతున్న సాయిశ్రీనివాస్‌

ఎస్‌టియు రాష్ట్ర అధ్యక్షులు సాయి శ్రీనివాస్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్రంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎస్‌టియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయి శ్రీనివాస్‌, యల్లు రఘునాథరెడ్డిలు విమర్శించారు. నగరంలోని క్రాంతి భవనంలో జిల్లా అధ్యక్షులు ఎస్‌.వి.రమణమూర్తి అధ్యక్షతన ఎస్‌టియు జిల్లా కార్యవర్గ ప్రథమ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిఒ 117 వల్ల ప్రభుత్వ విద్యా రంగం పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. మరోవైపు ఉద్యోగ, ఉపాధ్యా యులకు చెల్లించాల్సిన పిఆర్‌సి, డిఎ తదితర బకాయిలు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయ న్నారు. చర్చల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేక పోయిందన్నారు. ప్లస్‌ టు పాఠశాలల్లో చేస్తున్న ఉపాధ్యాయులకు ఎఫ్‌ఆర్‌ 22-బి మేరకు వేతన స్థిరీకరణకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం చేపట్టే విద్యాపరమైన సంస్కరణలు పేద, బడుగు, బలహీన, మధ్యతరగతి వర్గాల ప్రజలకు దగ్గర చేసేవిగా ఉండాలన్నారు. బోధనేతర సిబ్బందికి జెఎల్‌ ఉద్యోగోన్నతులు కల్పిస్తున్న ప్రభుత్వం అర్హు లైన స్కూల్‌ అసిస్టెంట్లకు జెఎల్‌గా ఉద్యోగోన్నతి కల్పించడం లేదని అన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం ఒక్క సమస్యా పరిష్కరించకుండా కాలయాపన చేయడంతో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినాయుడు, ఆర్థిక కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

 

➡️