ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులే జర్నలిస్టులు

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులే జర్నలిస్టులని సిఐ విజయ వాయునందన్‌ యాదవ్‌

భాస్కరరావును సత్కరిస్తున్న జర్నలిస్టులు

ప్రజాశక్తి- ఆమదాలవలస

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులే జర్నలిస్టులని సిఐ విజయ వాయునందన్‌ యాదవ్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని వన్‌ వే జంక్షన్‌ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌క్లబ్‌ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజ శ్రేయస్సుకు పాటు పడాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై గళాన్ని వినిపిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి మాట్లాడుతూ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ నిజాన్ని నిర్భయంగా తెలియజేయడమే జర్నలిస్టు విధి అని అన్నారు. జర్నలిస్టులు ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఎన్‌ఐజె జాతీయ కౌన్సిల్‌ సభ్యులు, ఫెడరేషన్‌ రాష్ట్ర నాయకులు సత్తారు భాస్కరరావు మాట్లాడుతూ పాత్రికేయ మిత్రులు ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండాలన్నారు. ప్రభుత్వాలు పాత్రికేయుల సంక్షేమం విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని పాత్రికేయులు ఉమ్మడిగా పోరాడి సాధించుకోవాలన్నారు. ప్రెస్‌క్లబ్‌ నూతన భవనాన్ని తొందర్లోనే నిర్మించుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ప్రెస్‌క్లబ్‌ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు సువ్వారి గాంధీ, కోట గోవిందరావు, సువ్వారి సత్యనారాయణ, పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనపల అన్నాజీరావు, టిడిపి నాయకులు తమ్మినేని విద్యాసాగర్‌, ఎపిడబ్ల్యుజెఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్‌, జిల్లా ప్రెస్‌క్లబ్‌ ఉపాధ్యక్షులు మురళీధరరావు పాల్గొన్నారు.

 

➡️