ప్రశాంత ఎన్నికల నిర్వహణకు సహకరించాలి

కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడి ప్రశాంత వాతావరణంలో

సమీక్షిస్తున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

రాజకీయ పార్టీల నాయకులతో సమీక్షించిన కలెక్టర్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి ప్రతిఒక్క రాజకీయ పార్టీ భాగస్వాములై, సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ ఆయా పార్టీల ప్రతినిధులకు సూచించారు. కలెక్టరేట్‌లో సాధారణ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సన్నద్ధతపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో 38వ వారపు సమీక్ష బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిష్పక్షపాతంగా చేపట్టామని అన్నారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో వివిధ రకాల పర్మిషన్ల కొరకు ‘సువిధ’ యాప్‌ ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవాలనే విషయంపై ఆయా పార్టీల ప్రతినిధులకు వివరించారు. జిల్లాలో ఎక్కడైనా అధికారులు కానీ, పార్టీల ప్రతినిధులు కానీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నట్లు మీ దృష్టికి వస్తే సి.విజిల్‌ యాప్‌ ద్వారా, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ టోల్‌ ఫ్రీ నంబరు 1950, కాల్‌ సెంటర్‌ నంబరు 18004256625కు ఫోన్‌ చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నాటి నుంచి ఓటర్ల జాబితాలో తొలగింపులు, మార్పులు ఉండవని, వాటికోసం వచ్చే దరఖాస్తులను పరిశీలిస్తామని చెప్పారు. జాబితాలో కొత్తగా పేర్లు చేర్చడానికి, ఒక చోట నుంచి మరో చోటకి ఓటు బదిలీకి మాత్రం అవకాశం ఉందని అన్నారు. 85 ఏళ్లు దాటిన వారు జిల్లాలో 11,455 మంది, వికలాంగ ఓటర్లు 21,486 మంది ఉన్నారని వీరు ఫారం 12డి సమర్పించడం ద్వారా ఇంటి నుంచే ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఇది తప్పనిసరి కాదని పోలింగ్‌ కేంద్రానికి వచ్చి కూడా వారు ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, డి.గోవిందరావు (సిపిఎం), రౌతు శంకరరావు (వైసిపి), పి.ఎం.జె.బాబు (టిడిపి), సురేష్‌ సింగ్‌ (బిజెపి), లాస సోమేశ్వరరావు (బిఎస్‌పి) పాల్గొన్నారు.

 

➡️