బాగా పనిచేసిన వారికి గరిష్ట కూలి

ఉపాధి హామీ కూలీలు బాగా పనిచేసి గరిష్ట కూలి పొందాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు

కూలీలతో మాట్లాడుతున్న చిట్టిరాజు

డ్వామా పీడీ జి.వి.చిట్టిరాజు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఉపాధి హామీ కూలీలు బాగా పనిచేసి గరిష్ట కూలి పొందాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు జి.వి.చిట్టిరాజు సూచించారు. గార మండలం నిజామాబాద్‌ పంచాయతీలోని కర్రి చెరువు, శ్రీకూర్మం వద్ద జరుగుతున్న ఫార్మ్‌ పాండ్‌ పనులను గురువారం పరిశీలించారు. అక్కడ పని చేస్తున్న కూలీలతో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం ప్రకారం కూలీలు పనిప్రదేశాల్లో రెండు పూటలా ఎనిమిది గంటలు పనిచేయాల్సి ఉందని అన్నారు. అయితే కనీసం 6 గంటల సమయం సమయపాలన పాటించి పనులు చేసినట్లయితే గరిష్ట కూలి పొందవచ్చు అన్నారు. చేసిన పనికి కొలతల ప్రకారం కూలి చెల్లింపులు జరుగుతాయన్నారు. సొంత వ్యవసాయ పనులు చూసుకుంటూ ఉపాధి పనులు చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. దీనిని గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇక్కడ మీరే యజమానులని, ఉద్యోగులందరూ మీకు సహాయకులుగా మాత్రమే ఉంటారని పేర్కొన్నారు. గ్రామాల్లో సుస్థిర వనరులు సృష్టించుకోవాల్సిన బాధ్యత మీదేనని అన్నారు. చెరువులు, పంట కాలువలు పనులు చక్కగా చేసినట్లయితే నీటి నిల్వ సామర్థ్యం పెరగడం ద్వారా పంటలకు అవసరమైన నీరు సమృద్ధిగా లభించడంతోపాటు నాణ్యమైన ఉత్పత్తులు దిగుమతి అవుతాయన్న అన్నారు. భూగర్బ జలాలు కూడా పెరగడం ద్వారా తాగునీటి ఇబ్బందులు తీరుతాయని తెలియజేశారు. జాబుకార్డు ఉన్న ప్రతి ఒక్క కూలీ వంద రోజులపాటు పనులకు రావాలని పిలుపునిచ్చారు. ఈయన వెంట ఎపిఒ శోభారాణి, ఇసి నారన్నాయుడు ఉన్నారు.

 

➡️