ముందస్తు అనుమతులు తప్పనిసరి

ఎన్నికల ప్రచారాలకు భారత ఎన్నికల సంఘ నియమ నిబంధనల

సమీక్షిస్తున్న జెసి నవీన్‌

జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ఎన్నికల ప్రచారాలకు భారత ఎన్నికల సంఘ నియమ నిబంధనల మేరకు అయా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ముందస్తు అనుమతి పొందాలని జెసి ఎం.నవీన్‌ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో 39వ వారపు సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రచారాలు, ఇతర అనుమతులకు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారుల వద్ద తప్పక అనుమతి పొందాలన్నారు. అనుమతి లేకుండా ప్రచార కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నాయకుల ర్యాలీలు, స్టార్‌ క్యాంపెయిన్‌, రోడ్‌ షో లాంటి కార్యక్రమాలకు 48 గంటల ముందే అనుమతి తీసుకోవాలన్నారు. డోర్‌ టూ డోర్‌ ప్రచారానికీ అనుమతి తప్పక ఉండాలన్నారు. వారం వారం షెడ్యూల్‌ రూపొందించుకుని దరఖాస్తులు చేసుకోవడం ద్వారా ముందస్తు అనుమతులు పొందవచ్చన్నారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను సంసిద్ధం చేశామని, జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా జిల్లా వ్యాప్తంగా మోడల్‌ కోడ్‌ ఉల్లంఘన చర్యలపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టామని తెలిపారు. ఏడాదిన్నర కాలంలో కొత్తగా 2,84,705 ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించామని వాటిలో 98 శాతం పంపిణీ పూర్తి చేశామన్నారు. జిల్లాలోని 2357 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ కోసం బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌, వివి ప్యాట్లు 150 శాతం అందుబాటులో ఉన్నాయన్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించి ఎన్నికల నామినేషన్‌ వరకూ ఫారం-6 అభ్యర్థనలు స్వీకరిస్తామని, ఇకపై ఓటర్ల జాబితాలో తొలగింపులు ఉండబోవని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం అభ్యర్థులు ప్రచార నిమిత్తం వినియోగించే బ్యానర్లు, జెండాలు, టోపీలు, వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించే అడ్వర్టైజ్మెంట్లకు సంబంధించిన రేటింగ్‌ కార్డు కూడా అందజేస్తామని చెప్పారు. పార్టీ అభ్యర్థులు అనుమతి తీసుకున్న ప్రకారమే ఖర్చు చేయాలన్నారు. యంసిసి, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, వీడియో వ్యూయింగ్‌ టీం, తదితర టీములు జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షిస్తున్నాయని అన్నారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వహించేలా సూచనలను ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమం లో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, రట్టి ప్రకాశరావు (సిపిఎం), రౌతు శంకరరావు (వైసిపి), పి.ఎం.జె.బాబు (టిడిపి), సురేష్‌ సింగ్‌ (బిజెపి), దేసెళ్ల గోవింద మల్లిబాబు (కాంగ్రెస్‌), ఎన్నికల సెల్‌ అధికారులు పాల్గొన్నారు.

 

➡️