మొదటి జాబితాలో ముగ్గురికే

టిడిపి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి మూడో పర్యాయం ఎన్నికల

టిడిపి అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు

రాష్ట్ర, జిల్లా పార్టీ అధ్యక్షులకు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యేకు మొదటి లిస్టులో చోటు

టిడిపి తరుపున పోటీ చేసే అభ్యర్ధుల పేర్లను ఆ పార్టీ అధినేత చంద్రబాబు శనివారం ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో టిడిపి-జనసేన పార్టీల తరుపున పోటీ చేసే అభ్యర్ధుల మొదటి జాబితాలో జిల్లా నుంచి ముగ్గురికే చోటు దక్కింది. జిల్లాలో ఎనిమిది నియోజక వర్గాలకు గాను టెక్కలి, ఆమదాలవలస, ఇచ్ఛాఫురం నుంచి పోటీచేసే అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ అధ్యక్షులకు తొలి జాబితాలో చోటు దక్కింది. టెక్కలి నుంచి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, ఆమదాలవలస నుంచి కూన రవికుమార్‌ పోటీ చేయనున్నారు. ఇచ్ఛాపురం నుంచి సిటింగ్‌ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ పేరును అధిష్టానం ప్రకటించింది. మరో ఐదు నియోజవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అభ్యర్ధుల ప్రకటనలో ఆయా నియోజకవర్గాల్లో టిడిపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి.

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి, టెక్కలి, ఇచ్ఛాపురం, ఆమదాలవలస

టిడిపి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి మూడో పర్యాయం ఎన్నికల బరిలో దిగనున్నారు. 2009లో టెక్కలి నియోజకవర్గం పునర్విభజన జరిగిన నేపథ్యంలో మొదటిసారిగా పోటీ చేసిన అచ్చెన్నాయుడు అప్పటి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కీర్తివేషులు కొర్ల రేవతిపతి చేతిలో అపజయం పాలయ్యారు. రేవతిపతి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కొర్ల భారతి చేతిలో ఓటమి చవిచూశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి వైసిపి అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి పేరాడ తిలక్‌పై విజయం సాధించారు. టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి వైసిపిలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోకపోతే, 2014లో మాదిరిగానే దువ్వాడతో పోటీ పడనున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ విప్‌ కూన రవికుమార్‌ నాలుగో పర్యాయం ఆమదాలవలస నుంచి బరిలో దిగనున్నారు. 2009 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యే పోటీ చేసిన ఆయన ఓటమి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బొడ్డేపల్లి సత్యవతి చేతిలో ఓటమి చవిచూశారు. 2014లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి… వైసిపి తరుపున పోటీ చేసిన ప్రస్తుత శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన స్పీకర్‌ సీతారాంలో చేతిలో ఓటమి చెందారు. 2024 ఎన్నికల్లో వైసిపి తరుపున ఎవరు పోటీ చేస్తారనేది ఇప్పటికీ ఇంకా స్పష్టత రాలేదు. శాసన స్పీకర్‌ తమ్మినేనికే సీటు కేటాయిస్తారంటూ ఆయన అనుకూలవర్గం, అభ్యర్థిని మారుస్తారంటూ వ్యతిరేకీయులు ప్రచారం చేస్తున్నారు. పార్టీ అధిష్టానం జాబితాను ప్రకటించిన తర్వాత కూన రవికుమార్‌కు ఎవరు ప్రత్యర్థి అనేది తేలనుందిఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా సిటింగ్‌ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను పేరు పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఆయన ఇక్కడ నుంచి టిడిపి తరుపున నాలుగో సారిబరిలో దిగనున్నారు. మొదటి సారి 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నర్తు రామారావుపై విజయం సాధించారు. ఆ తర్వతా 2019 ఎన్నికలో మరోసారి టిడిపి అభ్యర్థిగా బరిలో దిగి వైసిపి అభ్యర్థి పిరియా సాయిరాజ్‌ను ఓడించారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఈ సారి ఎలాగైనా వైసిపి జెండా ఎగురవేయాలని భావిస్తున్న వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జిని ఇటీవల మార్చింది. పిరియా సాయిరాజ్‌ స్థానంలో ఆయన సతీమణి పిరియా విజయను బరిలో దింపాలని యోచిస్తున్నట్లు తెలిసింది. మహిళా అభ్యర్ధిని పోటీలో నిలపడం ద్వారా విజయం సాధించాలని భావిస్తోంది. వైసిపి ఇన్‌ఛార్జిలో ఎటువంటి మార్పులు చేయకపోతే పిరియా విజయ వైసిపి తరుపున పోటీ చేసే అభ్యర్థి కానున్నారు.

➡️