రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న కేంద్రం

డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ

అంబేద్కర్‌ విగ్రహానికి నివాళ్లర్పిస్తున్న సిపిఎం నాయకులు

  • సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి విమర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాత 67వ వర్థంతి సందర్భంగా నగరంలోని అంబేద్కర్‌ కూడలిలో గల అంబేద్కర్‌ విగ్రహానికి బుధవారం పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్‌ సామాజిక న్యాయం కోసం జీవితాన్ని త్యాగం చేసి ఇచ్చిన రాజ్యాంగాన్ని బిజెపి ప్రభుత్వం భూస్థాపితం చేయాలని చూస్తోందని చెప్పారు. పౌర హక్కులు, ప్రాథమిక హక్కులను రద్దు చేసి నిరంకుశ పద్ధతిలో పాలన సాగించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. మనుధర్మ సిద్ధాంతాన్ని ప్రజలపై రుద్ది అగ్రకుల దురహంకారాన్ని అన్ని కులాలపై రుద్దడానికి ప్రయత్నం చేస్తోందని చెప్పారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకొచ్చాక మన రాష్ట్రంతో సహా అనేక రాష్ట్రాల్లో దళితులు, గిరిజనులు, మహిళలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై దాడులు విపరీతంగా పెరుగుతున్నాయని, పరువు హత్యలు జరుగుతున్నాయని తెలిపారు. కులాంతర వివాహం చేసుకున్న వారికి రక్షణగా ప్రభుత్వం ఆర్థిక సహాయం, ఉద్యోగం గ్యారంటీ చేసి అండగా ఉండాలని, వారి రక్షణకు చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు కుల, మతాలకతీతంగా అందరం పూనుకొని ప్రతిజ్ఞ తీసుకోవడమే అంబేద్కర్‌ ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె.మోహనరావు, పి.తేజేశ్వరరావు, ఆర్‌.ప్రకాష్‌, బి.సింహచలం తదితరులు పాల్గొన్నారు.

 

➡️