వ్యూహాల్లోనే మల్లగుల్లాలు

సాధారణంగా నిర్ధిష్ట రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహం రూపొందించుకోవడం, దానికి అనుగుణంగా ఎత్తుగడలు

సాధారణంగా నిర్ధిష్ట రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహం రూపొందించుకోవడం, దానికి అనుగుణంగా ఎత్తుగడలు వేయడం రాజకీయాల్లో సర్వసాధారణం. కానీ, నేటి అస్థిత్వ రాజకీయాల్లో కార్పొరేట్‌ సంస్థల నీడలో నడుస్తున్న పార్టీలు వ్యూహాల రూపకల్పనలో మల్లగుల్లాలు పడుతుండడం చూస్తున్నాం. ఇక ఎత్తుగడలు క్షణం క్షణం చిత్తములే అన్న చందంగా మారిపోయాయి జిల్లా రాజకీయాలు అందుకు అద్దంపడుతున్నాయి. ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికలోనూ తడబాటు ఎడబాటు పడుతున్నాయి. అధిక పార్టీ ఒంటరిగా వెళ్తున్నామని పదే పదే ప్రకటిస్తుండగా, ప్రధాన ప్రతిపక్షం, జనసేన పార్టీలు ఇతర పార్టీల కలయిక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అభ్యర్థుల ఎంపికలో ఎదురైన తిరుగుబాట్లు, అసంతృప్తులు, అలకలను ఏ రూపంలో ఎదుర్కోవాల న్నదానిపైన మల్లగుల్లాలు పడుతుండడం వల్లనే ఖరారు చేయడంలో జాప్యం జరుగుతున్నట్టు ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు అద్దంపడుతున్నాయి. అధికార పార్టీ ఇచ్ఛాపురం అభ్యర్థిని ప్రకటించిన వెంటనే అలకలు ప్రారంభమయ్యాయి. స్థానిక మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాజ్యలక్ష్మి తీవ్ర అసంతృప్తిలో ఉండి జరుగుతున్న పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. సామాజిక తరగతిలో ఒకరిద్దరు నాయకులు అదేబాటలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల భీమిలిలో జరిగిన ఉత్తరాంధ్ర ఎన్నికల ప్రచార సభకు ప్రజలను తరలించేందుకు అభ్యర్థి సారథ్యంలో కంచిలిలో సన్నాహక సభ నిర్వహించడం చూశాం. ఆ సభలో అభ్యర్థి విజయ భర్త పిరియా సాయిరాజ్‌ ఇప్పటి వరకు ఏమైనా తప్పులు నానుంచి ఎదురైతే క్షమించండి, నన్ను ఈ సారి ఆదరించాలని కార్యకర్తలకు కోరడం చూశాం. ఆయన భార్యపై అసంతృప్తి లేకున్నా సాయిరాజ్‌పై మాత్రం తీవ్ర అసంతృప్తలో కార్యకర్తలు, నేతలు ఉన్నారని తెలిసింది. కనీసం ఫోన్‌ చేసినా స్పందించరనే అపవాదు ఆయనపై ఉంది. అలకపూనిన వారిని బుజ్జగించే ప్రయత్నాలు ఇప్పటి వరకు జరగలేదని తెలిసింది. ముఖ్య నేతల ముందు పంచాయితీ పెట్టడానికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది. అదే సమయంలో ప్రత్యర్థి టిడిపి అభ్యర్థి, ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నారని తెలిసింది. పలాస నియోజకవర్గంలో అధికార పార్టీ గ్రూపు రాజకీయాలు సమసిపోవాల్సిన తరుణంలో బలపడుతూ వస్తున్నాయి. మంత్రి తమ రాజకీయంగా తమను దెబ్బతీశారని, అందుకు రిటన్‌ గిఫ్ట్‌ ఇస్తామని, మంత్రిని ఓడించడమే తమ లక్ష్యమని అసమ్మతి రాగం, ఆలాపన చేస్తున్నది. ఈ అసమ్మతి గానం మంత్రిని ఓడించడమే తమ లక్ష్యమని గతంలోనే ప్రకటించడం చూశాం. మార్చాలన్న నినాదం వారి నుంచి వినిపిస్తుంది. గౌతు శిరీషకు టిడిపి అభ్యర్థిగా ప్రకటిస్తారని, గెలుపుకోసం శాయశక్తులా ఒడ్డాలని తండ్రీకూతుళ్లు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే పలాస వైపు జనసేన దృష్టిసారించే అవకాశం ఉందని ప్రచారం ఉంది. ఆ ప్రచారం ఆచరణలోకి వస్తే అందుకు జనసేన ప్రయత్నాలు చేస్తే డాక్టర్‌ దానేటి శ్రీధర్‌ ఉన్నారు. ఆయన ఇటీవల మీడియాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. వైసిపి ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ను పార్టీ ప్రకటించిన తరువాత ఆయన మనసులో మాటను చెప్పారు. గత ఎన్నికల సమయలో దువ్వాడ శ్రీనివాస్‌కు ఎంపీ టిక్కెట్‌ ఇస్తాం, 2024లో జరిగే ఎన్నికల్లో నాకు పార్లమెంట్‌ టిక్కెట్‌ ఇస్తానని అధినేత జగన్‌ ఆనాడు హామీనిచ్చారని శ్రీధర్‌ వెల్లడించారు. తనకు రాజకీయాలు చేయాలన్న తపన ఉందని, గ్లాస్‌ గాని, సైకిల్‌ గాని ఎవరు పిలిచినా వెళ్లడానికి ఇసద్ధంగా ఉన్నానని ప్రకటించడం విశేషం. జగన్‌తో కలవాలని జిల్లాలో ముగ్గురు నేతలకు చెప్పానని, కానీ ఎవరూ ఈ ఐదేళ్లలో ఆ ప్రయత్నం చేయలేదని వెల్లడించారు. శివాజీ గతంలో ఇచ్ఛాపురంపై దృష్టిసారించారని, ఇప్పుడు సిటింగ్‌ ఎమ్మెల్యే ఉన్నందున అటువైపు దృష్టిసారించే అవకాశాలు తగ్గిపోయాయి. టెక్కలి నియోజకవర్గంలో మారో విషమ పరిస్థితిని వైసిపి అమలు చేసింది. గత ఎన్నికల్లో ఓడిన ఎంపీ అభ్యర్థికి, ఎమ్మెల్యే అభ్యర్థికి యథాతథంగా టిక్కెట్లు ఇస్తే బాగుండేదని సీనియర్లు చెప్పే పరిస్థితి వచ్చింది. ఐప్యాక్‌ సర్వే గురించి అంత ప్రచారం చేసుకున్నా పార్లమెంట్‌ అభ్యర్థి ఎంపిక విషయంలో దాసి డొల్లతనం బయటపడిందని ఓ సమావేశంలో వ్యాఖ్యానించడం చూశాం. ఎమ్మెల్యే అభ్యర్థులతో ముడిపడి ఉన్నందున ఒక్కమాటైనా తమకు అధిష్టానం చెప్పకపోవడం విచిత్రంగా ఉందని, అందువల్ల ఎంపీ అభ్యర్థి మార్చే అవకాశం లేకపోలేదని పోటీలో దిగనున్న ఆ నేత చెప్పడం విశేషం. ఎచ్చెర్ల నియోజకరవ్గంలో అధికార పార్టీ అభ్యర్థిగా కొత్త అభ్యర్థికి టిక్కెట్‌ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. టిక్కెట్‌ ఆశించిన చిన్న శ్రీను విజయనగరం పార్లమెంట్‌ బరిలో దిగుతారని, ప్రస్తుతం ఎంపీ ఎచ్చెర్ల అభ్యర్థిగా బరిలో నిలుస్తారన్న ప్రచారం వైసిపి వర్గాల్లో ఉంది. ఎచ్చెర్ల నియోజకవర్గంలో అసమ్మతిలో తరతమతేడాల్లో ఉన్నా… అభ్యర్థుల మార్పు దాదాపు ఉండకపోవచ్చునన్న ప్రచారం ఆ పార్టీలో ఉంది. టిడిపి పరిస్థితి విచిత్రంగా ఉంది. అధినేత చంద్రబాబు గొంతను రికార్డు చేసి సర్వేను చేపడుతుంది. ముందుగా పార్టీ సీనియనర్లతో చంద్రబాబు మాట్లాడడనున్నారని చెపుతారు. ఆ తరువాత చంద్రబాబు గొంతుతో ఫోన్‌ వస్తుంది. శ్రీకాకుళం నియోజకవర్గంలో గొండు శంకర్‌ అభ్యర్థిగా బాగుంటుందా? లేక గుండ లక్ష్మీదేవి అభ్యర్థిగా బాగుంటుందా? అన్నది ఒకటి రెండు నొక్కండని చెబుతున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎవరిని సూచించినా ఆ విషయం గోజప్యంగా ఉంటుందని ముక్తాయింపునివ్వడం విశేషం. టిడిపికి పాతపట్నం, ఎచ్చెర్లలో అసమ్మతి రాగం అనునిత్యం వెంటాడుతుంది. అభ్యర్థుల ఎంపిక తరువాత మరో ఒకటి రెండు నియోజకవర్గాల్లో అసంతృప్తి రాగం మొదలవుతుంది. అది తారాస్థాయికి చేరకుండా ఎలా చూస్తారన్నది చూడాల్సి ఉంది. అసమ్మతి నేతలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రత్యర్థుగా వస్తున్న వారు ఇప్పటి నుంచే బేరసారాలు చూస్తున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. వైసిపి ఎంపీ అభ్యర్థి ప్రకటన తరువాత డాక్టర్‌ శ్రీధర్‌ తన మనసులోని మాటను బట్టి చూస్తే వైసిపి నుంచి బయటకు వచ్చేశారు. అందులో నాకు పార్టీ సభ్యత్వం లేదని చెప్పడం విశేషం. శ్రీకాకుళంలో మరో డాక్టర్‌ పైడి మహేశ్వరరావు వైసిపిపై అసంతృప్తి ఉందా? అన్నది ఇంకా లేదు. ఈ కాలంలో ముఖ్య నేతను నమ్ముకుని నామినేటెడ్‌ పదవి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. ఇలా అసంతృప్తులు అన్ని నియోజకరవర్గాల్లోనూ తరతమ తేడాల్లో ఉన్నాయి. అందువల్ల అభ్యర్థుల ప్రకటన తరువాత మరిన్ని ఆరు పార్టీల్లోనూ బటయపడే అవకాశం ఉంది. అందువల్ల వ్యూహాల రూపకల్పనలో మల్లగుల్లాలు పడడం మరో నెల రోజుల్లో ముగింపు కానుంది. – సత్తారు భాస్కరరావు

➡️