సమస్యలు పరిష్కరించకుంటే గుణపాఠం

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల

బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు

  • ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల హెచ్చరిక
  • శ్రీకాకుళం నగరంలో బైక్‌ ర్యాలీ, ధర్నా

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని ఎన్‌జిఒ అసోసియేషన్‌ రాష్ట్ర సహాధ్యక్షులు చౌదరి పురుషోత్తం నాయుడు, ఎపి జెఎసి జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాం హెచ్చరించారు. పలు సమస్యల పరిష్కారం కోరుతూ నగరంలోని ఎన్‌జిఒ హోం నుంచి కలెక్టరేట్‌ వరకు మంగళవారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ పొడవునా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదేళ్లుగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. చర్చల్లో ఇచ్చిన హామీలను సైతం సకాలంలో నెరవేర్చకుండా దాటవేత వైఖరి అవలంబిస్తోందని ధ్వజమెత్తారు. 30 శాతం ఐఆర్‌, 11, 12 పిఆర్‌సి బకాయిలు మంజూరు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డిఎలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు హెల్త్‌ కార్డులు జారీ చేయాలన్నారు. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గురుకులాలు, సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలన్నారు. కొత్త పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని లేకుంటే ఈనెల 27న చలో విజయవాడ చేపడతామని హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌ కుమార్‌ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. ఉద్యోగులకు రావాల్సిన డిఎ బకాయిలను ఐదేళ్లలో చెల్లించలేదని చెప్పారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీతభత్యాల కోసం ప్రకటించే పిఆర్‌సిలో తీవ్రమైన అన్యాయం చేశారన్నారు. దేశ చరిత్రలోనే పిఆర్‌సి ద్వారా ఉద్యోగుల జీతాలు తగ్గించిన ఘనత జగన్‌ ప్రభుత్వానికి దక్కిందని విమర్శించారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రూ.25 వేల కోట్ల పైబడి బకాయిలు ఉన్నా, కుటుంబ అవసరాల కోసం ఉద్యోగులు రుణం కోసం దరఖాస్తు చేస్తే సమయానికి చెల్లింపులు జరగడం లేదన్నారు. కార్యక్రమంలో ఎపిటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.భానుమూర్తి, జిల్లా నాయకులు టి.చలపతిరావు, డిటిఎఫ్‌ నాయకులు పేడాడ కృష్ణారావు, యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు చౌదరి రవీంద్ర, బి.శ్రీరామ్మూర్తి, పెన్షనర్ల అసోసియేషన్‌ నాయకులు పార్వతీశం, బి.ధనుంజయరావు, పలు సంఘాల నాయకులు చల్లా శ్రీనివాసరావు, కె.భానుమూర్తి, మదన్‌మోహన్‌, బి.పూర్ణచంద్రరావు, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

➡️