సామాజిక ప్రగతి దిశగా ఎపి

Mar 5,2024 20:58

ప్రజాశక్తి-ఎచ్చెర్ల : విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌ గణనీయమైన ప్రగతి సాధించిందని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు సామాజికాభివృద్ధికి ఊతమిచ్చాయన్నారు. ఇండియన్‌ ఇంటలెక్చువల్‌ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ విశ్వవిద్యాలయంలో ‘సుపరిపాలనా దిశగా ఆంధ్రప్రదేశ్‌’ అనే అంశంపై జరిగిన ప్రత్యేక సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజల్లో సామాజిక, ఆర్థిక స్వావలంబన వచ్చినప్పుడే నిజమైన ప్రగతికి నిదర్శనమన్నారు. ఆ దిశగా అడుగులు వేయడంలో భాగంగానే ప్రభుత్వ వైద్యకళాశాలల ఏర్పాటు, యువతకు ఉపాధి అందించే పారిశ్రామిక ఒప్పందాలు, రైతులకు ఉపయోగ పడే చట్టాలు వంటి సాహసోపేత విధానాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. యూనివర్సిటీ విసి కె.ఆర్‌. రజిని అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు జి.శాంతమూర్తి, రిజిస్ట్రార్‌ బి.అడ్డయ్య, ప్రొఫెసర్‌ వి.వెంకట్రావు తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు అజేయ కల్లం సమాధానమిచ్చారు.
వైజ్ఞానిక సాంకేతిక ప్రదర్శన ప్రారంభం
డాక్టర్‌ బిఆర్‌. అంబేద్కర్‌ యూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్‌ కళాశాల ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించే వైజ్ఞానిక సాంకేతిక ప్రదర్శన మంగళవారం ప్రారంభమైంది. యూనివర్సిటీ సెమినార్‌ హాల్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైస్‌ ఛాన్సలర్‌ కె.ఆర్‌.రజిని మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, అంకితభావం, ఆశావహ దృక్ఫథం వంటి అంశాలు కలిగి ఉండాలన్నారు. విద్యార్థి దశ నుంచే కెరీర్‌ మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పల్సస్‌ సిఇఒ జి.శ్రీనుబాబు మాట్లాడుతూ సాంకేతిక రంగంలో పుష్కలమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు బహుముఖ ప్రజ్ఞ కలిగి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రిజిస్టర్‌ బి.అడ్డయ్య పాల్గొన్నారు.

➡️