సుగర్స్‌… రివర్స్‌

ఆమదాలవలస సుగర్స్‌ అంశంపై టిడిపి
  • బయటపడుతున్న వైసిపి, టిడిపి వైఖరి
  • భూములు వేటికి అనువుగా ఉంటాయో తెలపాలంటూ కలెక్టర్‌కు లేఖ
  • ఫ్యాక్టరీ స్థలంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటూ టిడిపి కొత్త రాగం
  • మరో పోరాటమే మార్గమంటున్న రైతాంగం

ఆమదాలవలస సుగర్‌ ఫ్యాక్టరీని సహకార రంగంలో తెరిపించాలన్న ఉద్దేశం అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు ఉన్నట్లుగా కనిపించడం లేదు. సుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని 2019 ఎన్నికల్లో హామీనిచ్చిన వైసిపి ఇప్పటివరకు దాని ఊసే ఎత్తడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిపుణుల కమిటీ ఏర్పాటు, ఫ్యాక్టరీ స్థల పరిశీలన పేరుతో కొంత హడావుడి చేసినా ఆ తర్వాత దాని జోలికి వెళ్లలేదు. పైగా ఫ్యాక్టరీ భూములు వేటికి అనువుగా ఉంటాయో అప్పటి జిల్లా కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌కు 2021లో లేఖ రాయడం ప్రభుత్వం అసలు ఉద్దేశాన్ని బట్టబయలు చేసింది. అధికార వైసిపి హామీపై నిలదీయాల్సిన టిడిపి ఆ పని చేయకపోగా, యూటర్న్‌ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఫ్యాక్టరీ స్థలంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటూ ఇటీవల శంఖరావం సభలో కొత్త రాగం అందుకుంది.

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

ఆమదాలవలస సుగర్స్‌ అంశంపై టిడిపి యూటర్న్‌ తీసుకున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో సుగర్స్‌కు ప్రత్యామ్నాయంగా ఆ స్థలంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నది టిడిపి కొత్త అజెండాను ఎంచుకుంది. సుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో హామీనిచ్చి నేటికీ తెరిపించలేదంటూ ఆమదాలవలసలో ఈనెల 13న నిర్వహించిన శంఖారావం సభలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ప్రస్తావించారు. శంఖారావం సభలు నిర్వహించిన ఆయా నియోజకవర్గాల్లో వైసిపి హామీనిచ్చి విస్మరించిన అంశాలను తాము అమలు చేస్తామని చెప్పిన లోకేష్‌, ఇక్కడ రేఖామాత్రంగానైనా చెప్పలేదు. ఫ్యాక్టరీ తెరవకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాట తప్పి మడమ తిప్పారంటూ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కూన రవికుమార్‌ విమర్శిస్తూనే, సుగర్‌ ఫ్యాక్టరీ స్థానంలో పరిశ్రమలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలంటూ చెప్పుకొచ్చారు. తద్వారా సుగర్‌ ఫ్యాక్టరీ విషయంలో టిడిపి వైఖరేమిటో తేటతెల్లమైంది.ప్రభుత్వ వంచనసుగర్‌ ఫ్యాక్టరీ విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు అనుసరించిన వైఖరిని గమనించిన టిడిపి, తనూ అదే దారిలో వెళ్తే జనం ఎవరికో ఒకరికి ఓటేయక మానరని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆమదాలవలస నియోజకవర్గానికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న తమ్మినేని సీతారాం సుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని 2019 ఎన్నికల్లో హామీనివ్వడంతో ఆ ప్రాంత ప్రజలు, రైతులు ఆదరించారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2020, ఫిబ్రవరి రెండో తేదీన ఆ ప్రాంతాన్ని నిపుణుల కమిటీ సందర్శించి, యంత్రాల పరిశీలనతో పాటు రైతులతో కమిటీ సభ్యులు మాట్లాడారు. తామంతా చెరుకు పండించడానికి సిద్ధంగా ఉన్నట్లు వారు కమిటీ ముందు స్పష్టంగా చెప్పారు. దీంతోపాటు ఫ్యాక్టరీని తెరిపించాలంటూ లక్ష సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. కమిటీ పర్యటించి నాలుగు గడిచినా దానికి అతీగతీ లేకుండా పోయింది. ఆ తర్వాత 2021 నవంబరులో అప్పటి కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌కు రాసిన లేఖ ప్రభుత్వం అసలు ఉద్దేశాన్ని బట్టబయలు చేసింది. పరిశ్రమకు సంబంధించి ఏవైనా న్యాయపరమైన చిక్కులు ఉన్నాయా?, పరిశ్రమను తెరవాలంటూ నిరంతరం ఆ ప్రాంతంలో ఉద్యమాలు ఏమైనా జరుగుతున్నాయా వంటి అంశాలపై తనిఖీ చేసి నివేదిక పంపాలంటూ లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా భూముల విలువ, పారిశ్రామిక, వాణిజ్య, నివాసయోగ్యం కేటగిరీల్లో వేటికి అనువుగా ఉంటాయో సరైన సూచనలు చేయాలంటూ కోరారు. కోర్టు కేసుల వివరాలు, భూముల విలువ వంటి అంశాలతో పాటు ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో ఎటువంటి ఆందోళనలు జరగడం లేదంటూ ఆ నెలలోనే కలెక్టర్‌ నివేదిక పంపారు. సుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించే ఉద్దేశం లేకే ప్రభుత్వం ఈ వివరాలన్నీ అడిగిందంటూ అప్పట్లో రైతుల్లో కొంత చర్చ సాగింది.రెండు దశాబ్దాలుగా మోసపోతున్న రైతులుసుగర్‌ ఫ్యాక్టరీ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా తక్కువేమీ తినలేదు. పాదయాత్ర సందర్భంగా 2003లో ఈ ప్రాంతానికి వచ్చిన కీ.శే వై.ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తాము అధికారంలోకి వస్తే సుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామంటూ హామీనిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ తరుపున పోటీ చేసిన బొడ్డేపల్లి సత్యవతిని ప్రజలు ఆదరించారు. ఆ తర్వాత ఓ సందర్భంలో వైఎస్‌ ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ, పెళ్లి చేసి అత్తారింటికి పంపేసిన తర్వాత ఆడపిల్లను తిరిగి తెచ్చుకోవడం సాధ్యమవుతుందా అంటూ నాడు చెప్పిన మాటలతో తొలిసారి రైతులు మోసపోయారు. ఇక అక్కడ నుంచి పాలక పార్టీల వంచనకు గురవుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సుగర్స్‌పై మరో ఉద్యమం చేపట్టడమే రైతుల ముందు ప్రత్యామ్నాయంగా ఉంది. ఆమదాలవలస సుగర్‌ ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ 2007 నుంచి 2014 మధ్య కాలంలో పాదయాత్రలు, రిలే నిరాహార దీక్షలు వంటి రూపాల్లో నిరంతరం ఆ అంశాన్ని ప్రజల మధ్య చర్చగా ఉంచింది. ప్రధాన రాజకీయ పార్టీలు సైతం దీనిపై మాట్లాడాల్సి వచ్చింది. ఇదే అంశం ఎన్నికల అజెండాగా మారింది. 2014, 2019 ఎన్నికల్లో టిడిపి, వైపిపిలు ఇదే హామీతో నెగ్గాయి. రైతులు నాటి పోరాట స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో సుగర్స్‌ అంశాన్ని ప్రధాన అజెండా మార్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకు అందరూ అన్నదాతలకు అండగా నిలవాల్సిన తరుణం ఆసన్నమైంది.

➡️