11న జీడి మద్దతు ధరపై ధర్నా

జీడి పిక్కలకు మద్దతు ధర ప్రకటించి బస్తాకు రూ.16 వేలు చెల్లించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు

పోస్టర్‌న ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి- పలాస

జీడి పిక్కలకు మద్దతు ధర ప్రకటించి బస్తాకు రూ.16 వేలు చెల్లించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహనరావు, జీడి రైతుల సంఘం జిల్లా కన్వీనర్‌ తెప్పల అజరు కుమార్‌ డిమాండ్‌ చేశారు. కాశీబుగ్గలో ఈ నెల 11న కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద జీడి పిక్కల మద్దతు ధరపై ధర్నా చేపడుతున్నామని, రైతులు పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జీడి రైతుల సంఘం, వామపక్షాల ఆధ్వర్యాన ధర్నా పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీడి పిక్కలకు మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ ఏడాది కాలంగా జీడి రైతు సంఘం ఆందోళన చేపడుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న ప్రభుత్వం ఆ సంఘాన్ని చర్చలకు పిలిచి, మద్దతు ధరపై జిఒ ఇస్తామని ఇచ్చిన హామీను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఐదేళ్లుగాజీడి రైతులను ధగా చేస్తుందన్నారు. జీడి రైతులకు ఇఛ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఆర్‌బికెల ద్వారా రైతులు పండించే అన్ని పంటలకూ మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేస్తామని చెబుతున్నా… ప్రభుత్వం ఆచరణలో శూన్యం అని ఏద్దేవా చేశారు. న్యాయమైన కోర్కెలతో జీడి రైతులు చేస్తున్న పోరాటానికి ప్రజలూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, జీడి రైతు సంఘం నాయకులు ఎస్‌.కృష్ణారావు, జీడి రైతుల సంఘం నాయకులు టి.భాస్కరరావు, ఎపి రైతు కూలి సంఘం నాయకులు కె.గురయ్య, ఎన్‌.హడ్డి, కె.హేమారావుచౌదరి, కె.పురుషోత్తం, వంకల మాధవరావు, చాపర వేణుగోపాల్‌, మద్దిల రామారావు పాల్గొన్నారు.

 

➡️