21 నుంచి లెనిన్‌ శత వర్థంతి సభలు

మార్క్సిస్టు మేధావి

సమావేశంలో మాట్లాడుతున్న గోవిందరావు

  • సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

మార్క్సిస్టు మేధావి లెనిన్‌ శత వర్థంతి సభలను ఈనెల 21 నుంచి నిర్వహించనున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి తెలిపారు. నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచంలోనే తొలి సోషలిస్టు విప్లవాన్ని సాధించిన మహా విప్లవ నేత కామ్రేడ్‌ లెనిన్‌ శత వర్థంతిని పురస్కరించుకుని ఏడాది పొడవునా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 21న జిల్లావ్యాప్తంగా వర్థంతి సభలు నిర్వహించాలన్నారు. కమ్యూనిస్టు అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రగతిశీలవాదులు, ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని నివాళులు అర్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటి శ్రామికవర్గ రాజ్యం సోవియట్‌ యూనియన్‌ను సాధించిన ఘనత లెనిన్‌ నాయకత్వానికి దక్కిందన్నారు. అసమానతలు లేని సోషలిస్టు సమాజ నిర్మాణానికి లెనిన్‌ పునాదులు వేశారని కొనియాడారు. పెట్టుబడిదారీ దోపిడీకి విరుగుడు సోషలిజమేనని ఆచరణలో రుజువు చేశారని చెప్పారు. ప్రజల సంపద కార్పొరేట్‌ పాలవుతున్న ప్రస్తుత కాలంలో లెనిన్‌ ఆవశ్యకత మరింత పెరిగిందన్నారు. యువత బంగారు భవిష్యత్‌కు దారిచూపే భారతదేశ అభ్యున్నతికి లెనిన్‌ సిద్ధాంతం మార్గదర్శకమవుతుందని తెలిపారు. 21న సిపిఎం జిల్లా కార్యాలయంఓ నిర్వహించే లెనిన్‌ వర్థంతి సభకు సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్‌.నర్సింగరావు పాల్గొంటారని, అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.

 

➡️