వేట నిషేధ సాయమేదీ..?

జిల్లాలోని 11

సర్వే పూర్తయినా డబ్బులు అందని పరిస్థితి

బోటు యజమాని సూచించిన పేర్లతో జాబితా

లోపభూయిష్టంగా క్షేత్రస్థాయి సర్వే

పరిహారం కోసం మత్స్యకారుల ఎదురుచూపులు

సముద్రంలో చేపల వేటపై ప్రస్తుతం నిషేధం కొనసాగుతుండడంతో, మత్స్యకారులు ఇళ్లకే పరిమితమయ్యారు. వేట లేకపోవడంతో పూట గడవడమూ కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వారికి నిషేధం విధించిన కాలానికి ఏటా ఒక్కో మత్స్యకారునికి రూ.పది వేలు చొప్పున అందిస్తోంది. ఈ సొమ్మును ప్రతి ఏడాది మే మూడో వారంలో అందించేది. ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకు వారికి డబ్బులు రాలేదు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో, ఈ ప్రక్రియలో కొంత జాప్యం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సర్వే ఆలస్యంగా జరగడం, జాబితాల రూపకల్పనలో జాప్యం వంటి కారణాలతో ఖాతాలో డబ్బులు పడలేదని సమాచారం. దీంతో పరిహారం సొమ్ము ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

జిల్లాలోని 11 మండలాల్లో 104 మత్స్యకార గ్రామాలున్నాయి. చేపల వేట ప్రధాన వృత్తిగా సుమారు 25 వేల కుటుంబాలు బతుకుతున్నాయి. గతేడాది 14,043 మందిని అర్హులుగా గుర్తించి వారికి పరిహారం అందించారు. వేట నిషేధిత కాలపు పరిహారాన్ని ప్రభుత్వం కొందరికే పరిమితం చేస్తోంది. పడవలో గరిష్టంగా పది మంది వరకూ చేపల వేటకు వెళ్తారు. మోటరైజ్డ్‌ బోట్లపై వేట సాగించిన వారిలో ఆరుగురికి, సంప్రదాయ తెప్పలపై వేట చేస్తున్న వారిలో ముగ్గురికి మాత్రమే సాయాన్ని అందిస్తోంది. దీంతో మిగిలిన మత్స్యకార కుటుంబాలు సాయం పొందలేకపోతున్నాయి. కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు వేటకు వెళ్తున్నా, అందులో ఒక్కరికే డబ్బులు అందిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన సాయం డబ్బులనే అందరూ కలిసి పంచుకుంటున్న పరిస్థితి ఉంది.బోటు యజమాని దయాదాక్షిణ్యాలపైనే…పరిహారం కోసం నిర్వహించిన సర్వే సమగ్రంగా లేదని తెలుస్తోంది. ప్రతి ఏడాది బోటు దగ్గర వెళ్లి యజమాని, వేటకు వెళ్లే మత్స్యకారుల వివరాలను నమోదు చేసేవారు. ప్రస్తుతం గ్రామాల్లోని బోటు యజమానులను కలిసి, వారు చెప్తున్న పేర్లనే పరిగణనలోకి తీసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కొన్నిచోట్ల బోటు యజమాని తనకు ఇష్టమొచ్చిన పేర్లను సూచిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.కొర్రీలతో కోతలువైఎస్సార్‌ మత్స్యకార భరోసా చెల్లింపులో అర్హులకు పలు కారణాలతో కొర్రీలు పెడుతున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. పరిహారం పొందేందుకు 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉండాలని సూచించింది. మత్స్యకారులకు 50 ఏళ్లకే పింఛన్‌ అందిస్తున్నారు. పింఛన్‌ సొమ్ము తీసుకుంటుడడంతో, వారిని మత్స్యకార భరోసాకు అనర్హులుగా పక్కన పెడుతోంది. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే సాయం అందిస్తామని పేర్కొంది. పల్లం భూమి మూడు ఎకరాలు గానీ మెట్టు పది ఎకరాలకు మించి గానీ ఉండకూడదని నిబంధన పెట్టింది. నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్న వారిని అనర్హులుగా పేర్కొంది. కుటుంబ విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లకు మించకూడదని సూచించింది. కుటుంబంలో ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగులు ఉంటే వారిని అనర్హులుగా స్పష్టం చేసింది. కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తుంటే వారికీ పథకం వర్తింపజేయబోమని తెలిపింది.గతేడాది పరిహారం నేటికీ అందని వైనంజిల్లాలో గతేడాది 14,043 మందిని అర్హులుగా గుర్తించారు. వారిలో సుమారు 800 మంది మత్స్యకారులకు నేటికీ వారి ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. బ్యాంకు ఖాతాలు మనుగడలో లేకపోవడం, ఇకెవైసి వంటి సాంకేతిక సమస్యలతో డబ్బులు ఆగిపోయాయి. తొలుత 1100 మంది మత్స్యకారుల వరకు డబ్బులు రాలేదని, సాంకేతిక సమస్యలు పరిష్కరించడంతో 300 మందికి డబ్బులు జమ అయ్యాయని చెప్పారు. ఆగిపోయిన పరిహారం కోసం ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నామని మత్స్యశాఖ ఉప సంచాలకులు పి.వి శ్రీనివాసరావు తెలిపారు.పరిహారం అందక ఆర్థిక ఇబ్బందులుచేపల వేట లేక, వేరే పని చేయలేక మత్స్యకారులు ఇళ్ల వద్దనే గడుపుతున్నారు. చేతిలో డబ్బుల్లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి ఖర్చుల కోసం తెలిసిన వారి దగ్గర అప్పులు చేస్తూ రోజులు గడుపుతున్నారు. చేపల వేట లేకపోవడంతో గుజరాత్‌, చెన్నై, ముంబయి, కేరళ తదితర ప్రాంతాలకు వలస వెళ్లిన మత్స్యకారులు తిరిగి సొంత గ్రామాలకే చేరుకోవడంతో కుటుంబ పోషణ మరింత భారంగా మారింది. ప్రభుత్వం వెంటనే పరిహారం డబ్బులు అందించేలా చూడాలని వారంతా కోరుతున్నారు.

➡️