అరుణ పతాక రెపరెపలు

అంతర్జాతీయ కార్మిక

పతాకాన్ని ఆవిష్కరిస్తున్న శ్రీనివాసు

  • జిల్లావ్యాప్తంగా పతాకావిష్కరణలు
  • ఘనంగా కార్మిక దినోత్సవం
  • మేడే స్ఫూర్తితో సమరశీల పోరాటాలు
  • సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లావ్యాప్తంగా అరుణ పతాకం రెపరెపలాడింది. పైడిభీమవరం, రణస్థలం, ఎచ్చెర్ల, పలాస పారిశ్రామికవాడలతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లో పతాకావిష్కరణలు చేపట్టారు. సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు, టిఎన్‌టియుసి వాటి అనుబంధ సంఘాలు, పారిశ్రామికరంగ, ఇతర కార్మికులు మే డే ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.మే డే స్ఫూర్తితో సమరశీల పోరాటాలుమే డే స్ఫూర్తితో సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో మే డే పతాకాన్ని సీనియర్‌ నాయకులు కె.శ్రీనివాసు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాల్లో ఎగిరే ఒకే ఒక జెండా ఎర్ర జెండా మాత్రమే అని అన్నారు. ప్రపంచంలో అన్ని సమస్యలకు పరిష్కార మార్గం చూపింది ఎర్ర జెండా మార్క్సిజం మాత్రమేనని స్పష్టం చేశారు. మార్క్సిజానికి మించిన సిద్ధాంతం మరొకటి లేదన్నారు. కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా చేసిందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టిందని తెలిపారు. బిజెపి ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సామాజిక న్యాయం తదితర వాటిని పధకం ప్రకారం ధ్వంసం చేస్తుందని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా వారి భూములను కార్పొరేట్లకు కట్టబెట్టాలని ప్రయత్నిస్తోందన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిందని విమర్శించారు. బిజెపి, దానితో పొత్తు పెటుకున్న టిడిపి, జనసేన… తొత్తుగా ఉన్న వైసిపికి ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం.ప్రభాకరరావు, ఎన్‌.గోపి, పొందూరు చందర్రావు, ఆర్‌.ప్రకాష్‌, వెంకటరావు పాణిగ్రహి, ఎ.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️