మార్పు లేనట్టే…

శ్రీకాకుళంలో మాజీ ఎమ్మెల్యే గుండ
  • శ్రీకాకుళం గొండు శంకర్‌, పాతపట్నంకు మామిడి గోవిందరావు ఫిక్స్‌!
  • తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్న గుండ, కలమట కుటుంబాలు
  • ఎంపీ ప్రచారానికి దూరంగా శ్రీకాకుళం టిడిపి కేడర్‌

జిల్లాలో అసెంబ్లీ అభ్యర్థిత్వాల విషయంలో ఎటువంటి మార్పులు చేయకూడదని తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. జిల్లాకు సంబంధించి గత నెల 22వ తేదీన ప్రకటించిన మూడో జాబితాలో శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి గొండు శంకర్‌, పాతపట్నం నియోజకవర్గానికి మామిడి గోవిందరావు, పలాస స్థానానికి గౌతు శిరీషను అభ్యర్థులుగా ఖరారు చేసిన విషయం తెలిసిందే. వీరినే అభ్యర్థులుగా కొనసాగించాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో గుండ, కలమట కుటుంబాలు భవిష్యత్‌ కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. పాతపట్నంలో ఈనెల 13న ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించి మరోసారి కార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకోవాలని కలమట నిర్ణయించారు. శ్రీకాకుళంలో ఈనెల 13 లేదా 14న కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఒక నిర్ణయం తీసుకోవాలని గుండ కుటుంబం భావిస్తున్నట్లు తెలిసింది.ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధిశ్రీకాకుళంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, పాతపట్నంలో కలమట వెంకటరమణకు టిడిపి అధిష్టానం టిక్కెట్లు నిరాకరించడంతో పార్టీ శ్రేణులు కోపోద్రిక్తులయ్యారు. టిక్కెట్ల ప్రకటన తర్వాత నిర్వహించిన ఆత్మీయ సమావేశాలకు భారీగా కార్యకర్తలు తరలివచ్చి మద్దతు పలికారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఒత్తిడి చేశారు. కొందరు నాయకులు ఒకడుగు ముందుకేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పోటీ కోసం విరాళాలు సైతం ప్రకటించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి ఇక్కడి పరిస్థితులు చేరడంతో హైదరాబాద్‌కు పిలిపించుకుని మాట్లాడారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు చెప్పిన విషయాలను జాగ్రత్తగా విని నాలుగైదు రోజుల్లో ఏదో విషయం చెప్తానని, అప్పటివరకు ఎటువంటి కార్యక్రమాలు చేయొద్దని ఇరువురికి హామీనిచ్చారు. పార్టీ నిర్ణయం కోసం కొద్దిరోజులుగా వారు నిరీక్షిస్తూనే ఉన్నారు. పాతపట్నం నియోజకవర్గ ఇన్‌ఛార్జి కలమట వెంకటరమణ ఈనెల తొమ్మిదో తేదీన ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో చంద్రబాబును కలిశారు. రెండు రోజులు గడిచినా ఇప్పటికీ ప్రకటన రాలేదు. శ్రీకాకుళం, పాతపట్నం అభ్యర్థిత్వాల విషయంలో పార్టీ తన నిర్ణయం మార్చుకునే పరిస్థితి కనిపించకపోవడంతో ఇన్‌ఛార్జీలు భవిష్యత్‌ కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.మరోసారి కార్యకర్తలతో సమావేశంఅభ్యర్థుల మార్పు ఉండబోదన్న సమాచారంతో గుండ, కలమట కుటుంబాలు మరోసారి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మూడో జాబితా ప్రకటన తర్వాత కార్యకర్తలతో ఒకసారి సమావేశమై అభిప్రాయాలను తీసుకున్న సంగతి తెలిసిందే. పాతపట్నంలో ఈనెల 13న ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించి కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవాలని కలమట వెంకటరమణ నిర్ణయించారు. పాతపట్నం స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్టీ బి-ఫారం ఇస్తే టిడిపి అభ్యర్థిగా, లేకుంటే స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగాలని యోచిస్తున్నట్లు సమాచారం. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఈనెల 13న గానీ 14న గానీ మరోసారి కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని గుండ కుటుంబం నిర్ణయించినట్లు తెలిసింది.ఎంపీ ప్రచారానికి దూరంగా గుండ అనుచరులుశ్రీకాకుళం పార్లమెంట్‌తో పాటు ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ప్రచారం మొదలుపెట్టారు. శ్రీకాకుళం, పాతపట్నం మినహా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం సాగించారు. అభ్యర్థుల మార్పు సమాచారంతో శ్రీకాకుళం, పాతపట్నం ప్రాంతాల్లో ప్రచారం చేయలేదు. గురువారం మాత్రం ఆయన శ్రీకాకుళం నగరంలో ప్రచారం చేశారు. అభ్యర్థుల మార్పు ఉండదన్న సమాచారం ఎంపీకి ఉండొచ్చని గుండ అనుచ రులు భావిస్తున్నారు. మరోవైపు రామ్మోహన్‌ నాయుడు ప్రచారానికి శ్రీకాకుళం నగర కేడర్‌ దూరంగా ఉంది. స్వయంగా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు పిలిచినా రాలేదని తెలిసింది. ఇన్‌ఛార్జీల వెంట నిలిచేదెవరో?టిడిపి మూడో జాబితా ప్రకటన తర్వాత శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. తమ నేతలకు పార్టీ టిక్కెట్‌ నిరాకరించడంపై రగిలిపోయారు. ఆ తర్వాత రెండు చోట్లా నిర్వహించిన ఆత్మీయ సమావేశాలకు నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని, సమావేశంలో అక్కడికక్కడే నిర్ణయం చెప్పాలని ఒత్తిడి చేశారు. కొంతమంది నాయకులు వేచి చూద్దామని చెప్పినా అంగీకరించలేదు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని చెప్తూ కొంతమంది నాయకులు విరాళాలు సైతం ప్రకటించారు. టిక్కెట్లు ప్రకటించి సుమారు 20 రోజులు కావస్తున్న నేపథ్యంలో నాయకులు, కార్యకర్తల్లో ఆ వేడి ఇప్పుడు ఉంటుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది. మరోవైపు శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు జోరుగా ప్రచారం సాగించడం మొదలుపెట్టారు. టిక్కెట్లు రాని నేతల కేడర్‌ క్రమేణా అటువైపు వెళ్లొచ్చని అధిష్టానం అంచనా వేసినట్లుగా కనిపిస్తోంది. కేడర్‌ ఆగ్రహాన్ని చల్లార్చడానికే చంద్రబాబు కొద్దిరోజులు నిర్ణయం వాయిదా వేశారనే చర్చ పార్టీలో సాగుతోంది. అభ్యర్థిత్వాల మార్పు విషయంలో హామీనిచ్చి చివరకు మొండిచేయి చూపడం ద్వారా చంద్రబాబు తమ నేతలను మరోసారి మోసం చేశారని వారు మండిపడుతున్నారు.

➡️