దేశ సమగ్రతకు బిజెపి తూట్లు

దేశ సమగ్రతకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం

మాట్లాడుతున్న మనోజ్‌ చౌహాన్‌

‘ఇండియా’ వేదిక అభ్యర్థులను గెలిపించాలి

ఎఐసిసి కార్యదర్శి మనోజ్‌ చౌహాన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

దేశ సమగ్రతకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఎఐసిసి కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు మనోజ్‌ చౌహాన్‌ విమర్శించారు. నగరంలోని ఇందిరా విజ్ఞాన్‌ భవన్‌లో శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌, అసెంబ్లీ అభ్యర్థులు, పార్టీ మండల, అనుబంధ సంఘాల బాధ్యులతో ఆదివారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రాభివృద్ధి సాధించాలంటే కాంగ్రెస్‌ వల్లే సాధ్యమన్నారు. బిజెపి దానికి మద్దతు ఇస్తున్న పార్టీల వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రజానీకాన్ని చైతన్యపరిచి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే తొమ్మిది గ్యారంటీ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీ, రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా, పేద కుటుంబంలోని మహిళకు ఏడాదికి రూ.లక్ష ఆర్థికసాయం, వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.ఆరు వేల పెన్షన్‌, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య, ఇల్లు లేని నిరుపేదలకు రూ.ఐదు లక్షలతో ఇళ్ల నిర్మాణం, రైతు పెట్టుబడిపై 50శాతం లాభంతో మద్దతు ధర వంటి గ్యారంటీ పథకాలను అమలు చేస్తామన్నారు. అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఈ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిని వైసిపి, టిడిపి తాకట్టు పెట్టాయని విమర్శించారు. పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి ఓటర్లు ఉన్నారని, వారిని తిరిగి పార్టీ కోసం పనిచేసేలా చైతన్యం చేయాలన్నారు. డిసిసి అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు అధ్యక్షత వహించిన సమావేశంలో అసెంబ్లీ అభ్యర్థులు మజ్జి త్రినాథ్‌బాబు, పైడి నాగభూషణరావు, సనపల అన్నాజీరావు, మాసుపత్రి చక్రవర్తి రెడ్డి, మంత్రి నరసింహమూర్తి, కె.వెంకట్రావు, సేవాదళ్‌ జాతీయ సహాయకార్యదర్శి బమ్మిడి గంగాధరరావు, డిసిసి అధికార ప్రతినిధి చింతాడ దిలీప్‌, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌.రామారావు, పిసిసి ప్రధాన కార్యదర్శి అంబటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

➡️