ఆ పార్టీలకు చరమగీతం పాడాలి

ప్రత్యేక హోదా, విభజన

మేనిఫెస్టోను విడుదల చేస్తున్న సిపిఎం నాయకులు

  • సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు
  • ఎన్నికల మేనిఫెస్టో విడుదల

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేసిందని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి విమర్శించారు. మతతత్వ బిజెపితో పొత్తు పెట్టుకున్న టిడిపి, జనసేన పార్టీలను, తొత్తుగా వ్యవహరిస్తున్న వైసిపినీ ఈ ఎన్నికల్లో చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో టిడిపి, జనసేన జత కట్టడం ఎవరిని మోసం చేయడానికని ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, ఫెడరల్‌ వ్యవస్థను పథకం ప్రకారం బిజెపి ధ్వంసం చేస్తోందని, పౌర హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. బిఎస్‌ఎన్‌ఎల్‌, పోస్టల్‌, బ్యాంకులు, ఇన్సూరెన్స్‌, రోడ్లు, పోర్టు, విద్యుత్‌, ఆయిల్‌ సెక్టార్‌, రైల్వే తదితర ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు ధారాదత్తం చేసిందన్నారు. ప్రజల సంపదను, ప్రకృతి వనరులను కార్పొరేట్‌ సంపదగా మార్చేస్తోందని విమర్శించారు. అటవీ హక్కుల చట్టాన్ని రద్దు చేసి, గిరిజనుల భూములకు రక్షణ లేకుండా చేసిందని చెప్పారు. కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సంపాదించుకున్న కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా బిజెపి ప్రభుత్వం చేసిందని విమర్శించారు. కొండలను గనులను అంబానీ, అదానీకి ధారాదత్తం చేస్తోందన్నారు. రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు సరే కదా భూములు అంబానీ, అదానీకి అప్పగించేస్తున్నారని విమర్శించారు. జీడి పంటకు మద్దతు ధర ప్రకటించాలని, గిరిజన ప్రాంతాలను ఐదో షెడ్యూల్‌లో చేర్పించి 1/70 చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపి దాని మిత్రపక్షాలను ఓడించాలని ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇండియా ఫోరం బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు, జిల్లా కమిటీ సభ్యులు కె.నాగమణి పాల్గొన్నారు.

➡️