చిరస్మరణీయులు శ్రీరాములు

కార్మిక, కర్షక, గిరిజన, ప్రజా సమస్యలపై పోరాడిన శ్రీరాములు

మాట్లాడుతున్న దడాల సుబ్బారావు

ప్రజా ఉద్యమాల నిర్మాణమే ఆయనకు ఘన నివాళి

సంస్మరణ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తులసీదాస్‌

ప్రజాశక్తి – వజ్రపుకొత్తూరు

కార్మిక, కర్షక, గిరిజన, ప్రజా సమస్యలపై పోరాడిన శ్రీరాములు ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా ఉంటారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌ అన్నారు. సిపిఎం సీనియర్‌ నాయకులు బమ్మిడి శ్రీరాములు సంస్మరణ సభను నగరంపల్లిలో శుక్రవారం నిర్వహించారు. శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయసులోనే ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేయడం ప్రారంభించిన ఆయన తుది శ్వాస విడిచే వరకు పోరుబాటను వీడలేదని కొనియాడారు. దోపిడీ పీడనకు వ్యతిరేకంగా గిరిజన హక్కుల కోసం పెద్దఎత్తున ఉద్యమాలు నిర్మించారని గుర్తుచేశారు. ప్రభుత్వ దమనకాండ, నిర్బంధకాండను సైతం లెక్కచేయక ప్రజా పోరాటాలు నడిపారని తెలిపారు. 1968 నుంచి 1975 వరకు అజ్ఞాతంలో ఉన్నారని, పార్వతీపురం కుట్ర కేసులో 1975లో అరెస్టయి రెండేళ్ల పాటు జైల్లో నిర్బంధించబడ్డారని తెలిపారు. ఉప్పు కార్మికులకు సంబంధించి కనీస వేతనాలు, పిఎఫ్‌, ఇఎస్‌ఐ… ట్రాక్టర్‌ కార్మికులకు పిఎఫ్‌, ఇఎస్‌ అమలు చేయాలని కార్మిక హక్కుల కోసం అలుపెరుగని పోరాటాలు చేశారని చెప్పారు. శివారు భూములకు వంశధార నీరు అందించడంలో అందరినీ ఐక్యం చేసి పోరాడారని గుర్తుచేశారు. ధాన్యం రైతులకు గిట్టుబాటు ధర కోసం పలు పోరాటాలు నడిపారని తెలిపారు. 90 ఏళ్ల వయసులోనూ జీడి కార్మికుల సమస్యలపై ఆందోళనలు చేపట్టిన ప్రజా పోరాట నాయకుడు అని అన్నారు. కమ్యూనిస్టు విలువలు, ప్రమాణాల కోసం శ్రీరాములు నికరంగా నిలబడ్డారన్నారు. 90 ఏళ్ల వయసులోనూ పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్నారని కొనియాడారు. ప్రజా ఉద్యమాల నిర్మాణమే బమ్మిడి శ్రీరాములుకు ఇచ్చే ఘన నివాళి అని అన్నారు.వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ నగరంపల్లి కేంద్రంగా పలాస ప్రాంతంలో ప్రజాసంఘాలను ఏర్పాటు చేసి, ప్రజాతంత్ర ఉద్యమాన్ని బలోపేతం చేశారని గుర్తుచేశారు. శ్రీరాములు తన జీవితాన్నే కాదని కుటుంబాన్నీ పార్టీకి అంకితం చేశారని కొనియాడారు. ఆయన చూపిన బాటలో నేటితరం పయనించాలన్నారు. శ్రీరాములు జీవిత విశేషాలపై ఎస్‌.మనోజ్‌, ఎన్‌.చంద్రయ్య, టి.వైకుంఠరావు రాసి ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. సిపిఎం మండల కమిటీ కన్వీనర్‌ నెయ్యిల మోహనరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, మన్యం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.తిరుపతిరావు, రైతుసంఘం నాయకులు కె.మోహనరావు, వి.జి.కె మూర్తి, శ్రీరాములు కుటుంబసభ్యులు బమ్మిడి ఆనందరావు, అరుణ్‌ కుమార్‌, రామకృష్ణ, వైద్యులు తెప్పల ఆనందరావు, ఎఐసిసిటియు నాయకులు వాసుదేవరావు, న్యూడెమోక్రసీ నాయకులు కుసుమ, సర్పంచ్‌ దువ్వాడ మధుకేశ్వరరావు, ఎంపిటిసి మోహనరావు, మాజీ సర్పంచ్‌ జైరాం చౌదరి, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

 

➡️