వాణిజ్యకు ధీటుగా సహకార బ్యాంకులు

వాణిజ్య బ్యాంకులకు

మాట్లాడుతున్న చైర్మన్‌ రాఘవేంద్రరావు

  • ది విశాఖ కో-ఆపరేటివ్‌ బ్యాంకు చైర్మన్‌ రాఘవేంద్రరావు

ప్రజాశక్తి – పలాస

వాణిజ్య బ్యాంకులకు ధీటుగా సహకార బ్యాంకులు సేవలందిస్తున్నాయని ది విశాఖ కో-ఆపరేటివ్‌ బ్యాంకు చైర్మన్‌ చలసాని రాఘవేంద్రరావు అన్నారు. కాశీబుగ్గలోని ఒక కళ్యాణ మండపంలో బ్యాంకు ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ కె.ప్రసాదరావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన మహాసభలో ఆయన మాట్లాడారు. దేశంలో సహకార బ్యాంకులకు ది విశాఖ కో-ఆపరేటివ్‌ బ్యాంకు ఆదర్శమన్నారు. బ్యాంకు ఖాతాదారులకు ఏ ఇతర సహకార బ్యాంకు అమలు చేయని పథకాలను చేస్తున్నామని చెప్పారు. సేవింగ్‌ ఖాతాల్లోని నిల్వలపై రోజువారీ లెక్కింపు ప్రాతిపదికన ఐదు శాతం వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకు కేవలం విశాఖపట్నం కో-ఆపరేటివ్‌ బ్యాంకు మాత్రమేనన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుకు 97,122 మంది సభ్యులు ఉండగా 2023-24 ఏడాదికి అది 1,04,865 మందికి చేరిందని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.83 కోట్ల లాభం వచ్చిందని, ఈ ఏడాది డెవిడెండ్లపై పది శాతం లాభాలను సభ్యుల ఖాతాలకు జమ చేశామన్నారు. దేశంలోని 1514 సహకార బ్యాంకుల్లో తొలి పది స్థానాల్లో నాలుగో స్థానంలో విశాఖ బ్యాంకు నిలిచిందని చెప్పారు. డిపాజిట్ల సేకరణలో 16వ స్థానం, రుణాల మంజూరులో 15వ స్థానం, మిగులులో పదో స్థానంలో ఉందన్నారు. పలాస బ్రాంచ్‌ ఏర్పాటు చేసి 11 సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు. బ్రాంచ్‌ సిబ్బంది, సంప్రదింపుల కమిటీ సభ్యులు, డైరెక్టర్‌ సహకారంతో డిపాజిట్ల సేకరణ, రుణాల మంజూరుకు కృషి చేస్తున్నామన్నారు. తనఖా రుణాల వాయిదాలను సక్రమంగా చెల్లిస్తే చెల్లించిన వడ్డీలో నాలుగు శాతం నగదు ప్రోత్సాహకంగా ఇస్తున్నామన్నారు. రూ.4,144 కోట్లు డిపాజిట్లు సేకరించగా, రూ.మూడు వేల కోట్లకు పైగా రుణాలు అందజేశామని, మొత్తం రూ.ఏడు వేల కోట్లతో లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జోనల్‌ మేనేజర్‌ ఎం.సత్యనారాయణ, పలాస బ్రాంచ్‌ మేనేజర్‌ పి.సిరి, రాజాం బ్రాంచ్‌ మేనేజర్‌ జి.ఎల్‌.వి ప్రకాశరావుతో పాటు బ్యాంకు సిబ్బంది, సమన్వయ కమిటీ సభ్యులు, షేర్‌ హోల్డర్లు పాల్గొన్నారు.

➡️