ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వద్దు

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో

పొందూరు : రాపాక కూడలిలో ప్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

* స్వేచ్ఛగా, సజావుగా నిర్వహణే లక్ష్యం

* జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – పొందూరు, జి.సిగడాం, ఎచ్చెర్ల

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌ అన్నారు. హింసకు తావు లేకుండా, ఎన్నికలు తిరిగి నిర్వహించే అవసరం రాకుండా పూర్తి స్వేచ్ఛగా, సజావుగా సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్‌ పనిచేస్తోందని చెప్పారు. పొందూరు, జి.సిగడాం, ఎచ్చెర్ల తహశీల్దార్‌ కార్యాలయాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఇప్పటికే చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం దిశానిర్దేశాల్లో ఎటువంటి తేడా వచ్చినా అందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు పటిష్టంగా పనిచేసే విధంగా ముందుగానే తగు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఉండాలని సూచించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు, ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎన్నికల కమిషన్‌ సూచనల ప్రకారం ఏర్పాట్ల విషయమై పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్‌ సిబ్బందికి సామగ్రిని అందించడంలో ఎలాంటి లోటుపాట్లు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. గొబ్బూరులో పోలింగ్‌ స్టేషన్‌ సందర్శించి ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. పొగిరిలో చెక్‌పోస్టు, నవభారత్‌ జంక్షన్‌ వద్ద ఎఫ్‌ఎస్‌టి బృందం పనితీరును పరిశీలించారు. ఎచ్చెర్ల తహశీల్దార్‌ కార్యాలయంలో సన్నద్ధతను పరిశీలించారు. అక్కడికి కొద్దిదూరంలో ఉన్న ఐఎంఎల్‌ డిపోను సందర్శించి మద్యం స్టాకు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోజువారీ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీరామ్మూర్తి, తహశీల్దార్లు ఉమామహేశ్వరరావు, ఎం.పాల్‌కిరణ్‌, ఎంపిడిఒలు వెంకన్నబాబు, సిహెచ్‌.సూర్యనారాయణ, ఎస్‌ఐలు మధుసూదనరావు, రవికుమార్‌, డిటి వై.వి ప్రసాద్‌, ఆర్‌ఐ రామచంద్రరావు, బిఎల్‌ఒ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

➡️