అథ్లెటిక్‌ క్రీడాకారులకు ప్రోత్సాహం

జిల్లాలో అథ్లెటిక్స్‌ క్రీడాకారులకు

మాట్లాడుతున్న మధుసూదనరావు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలో అథ్లెటిక్స్‌ క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందించాలని జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ తీర్మానించింది. ఈ ఏడాది జిల్లాలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ హాల్లో అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు అధ్యక్షతన జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ సర్వసభ్య శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో కార్యదర్శి ఎం.సాంబమూర్తి, రాష్ట్ర అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి నౌపడ విజరుకుమార్‌, జిల్లా అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు కామయ్య మాస్టార్‌, గోపి మాస్టర్లతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. జిల్లాలో అథ్లెటిక్స్‌ పరంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలన్న దానిపై ప్రధానంగా సభ్యులు చర్చించారు. అవకాశం వస్తే ఈ ఏడాది రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు జిల్లాలో నిర్వహించాలని ఆలోచన చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర అసోసియేషన్‌ దృష్టికి తీసుకువెళ్లి ఇక్కడ పోటీలను నిర్వహించి స్థానిక క్రీడాకారులలో జోష్‌ నింపాలని నిర్ణయించారు. అవకాశం ఉన్నచోట్ల అథ్లెటిక్స్‌ క్రీడాకారులకు శిక్షణ ఇవ్వాలని తీర్మానించారు. క్రీడలపై ఆసక్తి ఉండేవారిని గుర్తించి అథ్లెటిక్స్‌ రంగంలో వారు రాణించేలా తగిన ప్రోత్సాహం అందించాలని చర్చించారు. జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా చర్చించిన అంశాలను అధ్యక్ష, కార్యదర్శులు కొన్న మధుసూదనరావు, ఎం.సాంబమూర్తిలు వివరించారు. సమావేశంలో లీగల్‌ అడ్వయిజర్‌ నౌపడ విజరు కుమార్‌, పిఇటి సంఘ నాయకులు రమణ, కార్యవర్గ సభ్యులు, సీనియర్‌ న్యాయామ ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️