ఇండియా వేదికే ప్రత్యామ్నాయం

ఇండియా వేదికే ప్రత్యామ్నాయం

మాట్లాడుతున్న సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌

  • బిజెపి ఎపి ప్రజల వ్యతిరేకి
  • టిడిపి, వైసిపి ఆ పార్టీతో చేతులు కలిపాయి
  • ఎన్నికల్లో ఎన్‌డిఎ ఆశలు పటాపంచలు
  • సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్న బిజెపితో రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి చేతులు కలిపిన నేపథ్యంలో ప్రజలకు ఇండియా వేదికే సరైన ప్రత్యామ్నాయమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ అన్నారు. నగరంలోని ఒక హోటల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలను పట్టించుకోని వైసిపి, టిడిపి రాష్ట్రంలో ఉండడం విచారకరమన్నారు. ఎన్నికల్లో తమకు సీట్లు పెరుగుతాయని ఆశించిన బిజెపి, దాని మిత్రపక్షాల ఆశలను ప్రజలు పటాపంచలు చేస్తున్నారని చెప్పారు. రెండు దశల పోలింగ్‌ తర్వాత బిజెపి అంచనాలు తలకిందులయ్యాయన్నారు. గ్యాస్‌ బెలూన్‌లో గాలి అమాంతంగా పెరిగి పేలిపోయినట్లుగా బిజెపి పరిస్థితి ఉందన్నారు. ఓటమి నిరాశతో ప్రధాని మోడీ విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని, ప్రత్యేకించి మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. దేశ చరిత్రలో ఏ ప్రధాని ఇలా మాట్లాడడం ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, దేశ చట్టాలను ఉల్లంఘిస్తున్న మోడీపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని చెప్పారు. కర్నాటకలో సెక్స్‌ కుంభకోణంలో సిట్టింగ్‌ ఎంపీ పాత్ర ఉందని బిజెపి, జెడిఎస్‌ నాయకులకు తెలిసినా, మోడీ అటువంటి వ్యక్తి కోసం ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగాన్ని, మతతత్వ రాజకీయాలను, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ను ఓడించాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందన్నారు. దేశంలో టైర్‌ పంక్చర్‌ అయిన బిజెపికి, రాష్ట్రంలో చంద్రబాబు స్టెపినీలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ వ్యతిరేక పార్టీ బిజెపితో టిడిపి ప్రత్యక్షంగా, వైసిపి పరోక్షంగా పొత్తు పెట్టుకున్నాయన్నారు. బిజెపి తీసుకొచ్చిన రైతు, కార్మిక వ్యతిరేక బిల్లులకు ఓటు వేసిన వైసిపి ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదాపై నోరు మెదపకుండా నోటికి ఫెవికాల్‌ పెట్టుకున్నారని విమర్శించారు.విభజన చట్టం అమలు చేయకుండా మోసం : నర్సింగరావుబిజెపి అధికారంలోకి వచ్చి పదేళ్లు గడుస్తున్నా, విభజన చట్టం అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో పరిశ్రమలు రావడం లేదని, దీంతో వెనుకడిన ప్రాంతంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో వలసలు మరింత పెరిగాయని చెప్పారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలేవీ ఏర్పాటు చేయకపోగా, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సైతం బిజెపి ప్రభుత్వం అమ్మేయాలని చూస్తోందన్నారు. ఎన్నికల్లో బిజెపి కూటమి, నిరంకుశ వైసిపిని ఓడించి ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు.జిల్లాలో అణు బాంబు పెడుతున్నారు : గోవిందరావుగుజరాత్‌లోని మితిమిర్ధి వద్ద ఏర్పాటు చేయాల్సిన ప్రమాదకర అణువిద్యుత్‌ కేంద్రాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కొవ్వాడలో ఏర్పాటు చేస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు విమర్శించారు. కొవ్వాడలో అణువిద్యుత్కేంద్రం ఏర్పాటు చేయడమంటే జిల్లాలో అణుబాంబు పెట్టడమేనన్నారు. అణువిద్యుత్‌ ప్లాంట్‌లో ఏ చిన్న ప్రమాదం సంభవించినా, ఛత్రపూర్‌ నుంచి కాకినాడ వరకు సమస్త జీవకోటి నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో వంశధార రిజర్వాయరు పూర్తి చేయకుండా వైసిపి, టిడిపిలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని విమర్శించారు. ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ ప్రారంభించి పదేళ్లు గడిచినా 13 కిలోమీటర్లు కాలువ తవ్వలేకపోయారని చెప్పారు. జీడి మద్దతు ధర లేక రైతులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని విమర్శించారు. సమావేశంలో సిపిఎం నాయకులు బి.కృష్ణమూర్తి, కె.నాగమణి పాల్గొన్నారు.

➡️