ఆన్‌లైన్‌లో పిఎఫ్‌ స్లిప్పులు ఉంచాలి

జిల్లాపరిషత్‌ యాజమాన్యం పరిధిలో పనిచేస్తున్న

డిప్యూటీ సిఇఒతో సమస్యలపై చర్చిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

జెడ్‌పి డిప్యూటీ సిఇఒకు యుటిఎఫ్‌ వినతి

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాపరిషత్‌ యాజమాన్యం పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌ స్లిప్పులను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌ కుమార్‌, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్‌.బాబూరావు, బి.శ్రీరామ్మూర్తి కోరారు. నగరంలోని జిల్లాపరిషత్‌ కార్యాలయంలో డిప్యూటీ సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌ను ఆయన ఛాంబరులో శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. 2019-20, 2020-21, 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్య నిధి ఖాతాల వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న బూస్టర్‌ స్కీమ్‌ క్లయిమ్‌లను పరిష్కరించాలని కోరారు. ఉద్యోగ విరమణ క్లయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఇటీవల ఎయిడెడ్‌ యాజమాన్యం నుంచి మండల పరిషత్‌, జిల్లా యాజమాన్యంలోకి మారిన ఉపాధ్యాయుల భవిష్యనిధి ఖాతా నంబర్ల మంజూరుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సిఇఒ హామీనిచ్చారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కోశాధికారి రవికుమార్‌, జిల్లా కార్యదర్శి హెచ్‌.అన్నాజీరావు, రాష్ట్ర కౌన్సిలర్‌ పొందూరు అప్పారావు, ఎల్‌.కోదండరామయ్య, రెడ్డి త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️