పారిశుధ్య కార్మికుడు హత్య

నగరంలోని గూనపాలెంకు చెందిన పారిశుధ్య కార్మికుడు

మృతుడు సురేష్‌ 

గొంతు కోసి హతమార్చిన దుండగులు

ఇంటి మేడపై నిద్రిస్తుండగా దారుణం

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

నగరంలోని గూనపాలెంకు చెందిన పారిశుధ్య కార్మికుడు శీర సురేష్‌ (34) గురువారం అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. ఇంటి మేడపై నిద్రిస్తున్న సమయంలో కత్తితో గొంతు కోయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డిఎస్‌పి కార్యాలయానికి కూతవేటు దూరంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. పోలీసుల కథనం ప్రకారం శ్రీకాకుళం నగరపాలక సంస్థలో పారిశుధ్య కార్మికునిగా పనిచేస్తున్న సురేష్‌ గూనపాలెంలోని రామమందిరం సమీపంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. గురువారం రాత్రి కుటుంబసభ్యులతో సరదాగా గడిపిన సురేష్‌, తాను నివాసం ఉంటున్న ఇంటి దగ్గర్లో ఉన్న మేడపై భార్య, పిల్లలతో కలిసి నిద్రించాడు. మధ్య రాత్రిలో ఆయన భార్య తిరుమలకు మెలకువ వచ్చి లేచి చూసేసరికి సురేష్‌ మేడ పైనే కొంచెం దూరంలో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆయన గొంతు కోసి చలనం లేకుండా పడి ఉండడంతో ఆందోళన చెందిన ఆమె, కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. వారు వచ్చి చూసి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న సిఐ సన్యాసినాయుడు, ఒకటో పట్టణ ఎస్‌ఐ గణేష్‌ మృతదేహాన్ని పరిశీలించారు. గుర్తుతెలియని దుండగులు సురేష్‌ గొంతు కోసం హతమార్చినట్లు నిర్ధారించి, దర్యాప్తు ప్రారంభించారు.పారిశుధ్య కార్మికునిగా పనిచేస్తున్న సురేష్‌కు స్థానికంగా ఎవరితోనూ విభేదాల్లేవని ఆయన కుటుంబసభ్యులు చెప్తున్నారు. సురేష్‌కు 14 ఏళ్ల కిందట తిరుమలతో వివాహమైంది. వారిద్దరిదీ కులాంతర ప్రేమ వివాహం. వారికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. గురువారం సాయంత్రం పిల్లలతో కలిసి బయటకు వెళ్ళి రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత తన భర్తకు ఫోన్‌ చేశానని, ఆయన ఇంటికి చేరుకున్న తర్వాత పిల్లలతో సరదాగా గడిపామని తిరుమల చెప్తోంది. రాత్రి 11 గంటల సమయంలో ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడిన తర్వాత తాము మేడ పైకి వెళ్లి నిద్రించామని విచారణలో పోలీసులకు తెలిపింది. మధ్యలో తాను లేచిన సమయంలో నిద్రలోనే ఉన్నారని చెప్పింది. అర్ధరాత్రి 1.30 గంటల దాటిన తర్వాత మెలకువ వచ్చి చూసేసరికి తమకు కాస్త దూరంలో రక్తపుమడుగులో పడి ఉన్నాడని తెలిపింది. సిఐ సన్యాసినాయుడు, ఎస్‌ఐ గణేష్‌ భార్య, ఇతర కుటుంబసభ్యులతో మాట్లాడి పలు కోణాల్లో ఆరా తీశారు. సురేష్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. సురేష్‌ తండ్రి రమణయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.సిసి ఫుటేజ్‌ని పరిశీలించిన పోలీసులుగూనపాలెం ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో సంచరించిన వారి కోసం పోలీసులు వీధిలో అమర్చిన సిసి కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. ఫుటేజ్‌ ఆధారంగా ముగ్గురు వ్యక్తులు ఆ ప్రాంతంలో సంచరించినట్లు అనుమానిస్తున్నారు. కేసును ఛేదించే పనిలో ప్రత్యేక బృందాలు నిమగమై ఉన్నాయి. మృతుని కాల్‌డేటాను పోలీసులు సేకరించడంతో పాటు స్థానికులతో మాట్లాడి సురేష్‌ హత్య వెనుక బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. సురేష్‌కు స్థానికంగా ఎవరితోనూ వైరం లేదని కుటుంబసభ్యులు చెప్పడంతో, ఆయనకు వివాహేతర సంబంధాల కోణంలోనూ దర్యాప్తు చేపడుతున్నారు.

 

➡️