రైతాంగ సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే మార్గం

– సంయుక్త కిసాన్‌ మోర్చా రాష్ట్ర కన్వీనర్‌, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ :రైతాంగ సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే మార్గమని సంయుక్త కిసాన్‌ మోర్చా రాష్ట్ర కన్వీనర్‌, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. ఏలూరులోని టుబాకో మర్చంట్స్‌ అసోసియేషన్‌ హాల్లో జరుగుతున్న రైతు కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్‌) రాష్ట్ర మహాసభలో భాగంగా రెండో రోజు ఆదివారం ‘వ్యవసాయ రంగ సంక్షోభం – పాలకుల విధానాలు – మన కర్తవ్యాలు’పై అనే అంశంపై సదస్సు నిర్వహించారు. తొలుత ప్రజాకవి సుంకర రచించిన అల్లూరి సీతారామరాజు ‘బుర్రకథ’ను ప్రజా కళాకారుల బాలికా బృందం ప్రదర్శించింది. అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ అధ్యక్షతన జరిగిన సదస్సులో వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడారు. గత పదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేసే హామీని ఎగ్గొట్టిన మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు మాత్రం రూ.25 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసిందన్నారు. మరోపక్క కనీస మద్దతు ధరను చెల్లించకుండా రైతాంగాన్ని రూ.లక్షల కోట్ల నష్టాలకు గురిచేసిందని, దీనికి నిరసనగానే గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో అధికారంలో నుంచి తప్పుకోమని ప్రజలు మోడీ ప్రభుత్వానికి సీట్లు తగ్గించారన్నారు. భారతదేశం మొత్తంగా 19 కోట్ల రైతు కుటుంబాలకు, కుటీర పరిశ్రమలకు ఇచ్చిన రుణాల కన్నా కేవలం 20 కార్పొరేట్‌ సంస్థలకు ఇచ్చిన రుణాలే ఎక్కువని వివరించారు. ప్రభుత్వాల పంటల బీమా పథకాలు రైతుల కంటే ఇన్సూరెన్స్‌ కంపెనీలకే ఎక్కువ మేలు చేస్తున్నాయని తెలిపారు. వ్యవసాయానికి సాగునీటిని కల్పించడంలో పాలకులు తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న రైతు, ప్రజా వ్యతిరేక విదానాలపై ఐక్యంగా పోరాడాలని కోరారు. నల్లమడ రైతాంగ సమితి నాయకులు డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌ ‘భారత రైతాంగ ఉద్యమం-కనీస మద్దతు ధర’ అనే అంశంపై మాట్లాడారు. స్వామినాథన్‌ కమిషన్‌ ప్రధానంగా భూసంస్కరణలు జరగాలని, రైతాంగానికి కనీస మద్దతు ధరలు దక్కాలని చెప్పిందని గుర్తు చేశారు. అయితే, నేటికీ ప్రభుత్వాలు వాటిని అమలు చేయడానికి పూనుకోవట్లేదన్నారు. సదస్సులో వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఎన్‌.వేణుగోపాల్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, ఎపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కెవివి.ప్రసాద్‌ సందేశాలిచ్చారు.

➡️