మత్స్యకార యువకుడు సత్తా

సాధించాలన్న తపన

సాయికుమార్‌

  • నేషనల్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ ట్రైనీగా ఎంపిక
  • ఆలిండియాలో సాయికుమార్‌కు ఐదో ర్యాంకు

ప్రజాశక్తి – కవిటి

సాధించాలన్న తపన ఉండాలే గానీ కష్టాల కడగండ్లు అందుకు అడ్డం కాదని నిరూపించాడు ఆ మత్స్యకార యువకుడు. సంసారమనే సంద్రాన్ని దాటేందుకు కష్టాల కడలి ఈదుతున్న తన తండ్రి కష్టాన్ని చిన్నప్పట్నుంచీ చూస్తూ పెరిగిన ఆ అబ్బాయి, ఆ కడలి కెరటాలను దాటుకుని తీరానికి చేరాడు. తనలాంటి మరెందరికో దిక్సూచిలా మారాడు.కవిటి మండలం కపాసుకుద్దికి చెందిన మాగుపల్లి సాయికుమార్‌ నేషనల్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ ట్రైనీగా ఎంపికై సత్తా చాటాడు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు కవిటి ఎస్‌.వి.జె విద్యాసంస్థల్లో చదివిన సాయికుమార్‌ అగ్రికల్చర్‌ డిప్లమా అనకాపల్లిలో, అగ్రికల్చర్‌ బిఎస్‌సి శ్రీకాకుళం నైరలో, ఎంఎస్‌సి బాపట్లలో పూర్తి చేశాడు. సాయికుమార్‌ సాధించిన ఈ విజయం వడ్డించిన విస్తరి కాదు. ఎన్నో అవాంతరాలు, మరెన్నో అడ్డంకులు దాటుకుని చేసిన ఓ ఆదర్శవంతమైన ప్రయాణం. ఓ వైపు పూట గడవాలంటే చేపల వేటకు వెళ్లాలి. మరోవైపు అవసరాలు తీరాలంటే అప్పులు చేయాల్సిన కుటుంబ పరిస్థితి నుంచి సాయికుమార్‌ సాధించిన ఈ ఘనత నేటి యువతకు ఆదర్శప్రాయం.వలసలకు పుట్టినిల్లు అయిన కవిటి మండలం అందులోనూ మత్స్యకార సామాజిక తరగతికి చెందిన సాయికుమార్‌ది కవిటి మండలం కపాసుకుద్ది గ్రామం. సాయికుమార్‌ తండ్రి మాగుపల్లి నాయుడు చేపల వేటకు వెళ్తేనే, ఆ కుటుంబానికి భృతి లేదంటే పస్తులే. ఇటువంటి పరిస్థితుల్లో ప్రాథమిక దశలో సోదరుడు శరత్‌కుమార్‌తో పాటు సాయికుమార్‌ కూడా వేటకు వెళ్లి తండ్రికి సాయపడేవాడు. తల్లి తిరుపతమ్మ వీరి బాగోగులు చూస్తూ కుటుంబాన్ని సాకేది. రెక్కాడితే గానీ డొక్కాడని తమ కుటుంబ పరిస్థితిని గుర్తించిన సాయికుమార్‌, శరత్‌కుమార్‌ చదువే తమను సమస్యల నుంచి గట్టెక్కిస్తుందని గుర్తించారు. ఓవైపు వేట కొనసాగిస్తూనే చదువుని నిర్లక్ష్యం చేయకుండా చూసుకున్నారు. పిల్లలకు చదువు మీద ఉన్న ఆసక్తి చూసి వారి తల్లిదండ్రులు కూడా తమవంతు పూర్తి సహకారం అందించారు. దీంతో ముందుగా శరత్‌కుమార్‌ తన చదువు ముగించి ఆర్మీలో చేరాడు. ఈలోగా తండ్రి చనిపోవడంతో మళ్లీ వీరికి సమస్యలు మొదలయ్యాయి. చదువుపై మొక్కవోని దీక్షతో ఉన్న సాయికుమార్‌ గ్రామీణ ప్రాంతంలో ఉండడంతో మొదట్నుంచీ వ్యవసాయరంగాన్ని నిరంతరం పరిశీలిస్తూ తన చదువు కొంతమంది రైతులకైనా ఉపయోగపడాలనే తపన పడేవాడు. అందులో భాగంగానే అగ్రికల్చర్‌ డిప్లమో తీసుకుని నిరంతరం శ్రమించి బాపట్లలో అగ్రికల్చర్‌ పిజి పూర్తి చేశాడు. అనంతరం ప్రకాశం జిల్లాలోని సి.ఎస్‌ పురం అగ్రికల్చర్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తూ జనవరిలో నిర్వహించిన నేషనల్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ పరీక్ష రాశాడు. ఇన్నేళ్ల అతని శ్రమకు ఆ పరీక్ష ప్రతిఫలం లభించేలా చేసింది. మంగళవారం రాత్రి వచ్చిన తుది ఫలితాల్లో సాయికుమార్‌ ఆలిండియాలో ఐదో ర్యాంకు సాధించి మేనేజింగ్‌ ట్రైనీగా ఎంపికయ్యాడు. అంతే ఒక్కసారి తన నేపథ్యం గుర్తుకు తెచ్చుకుని ఉద్వేగానికి లోనయ్యాడు. తన ఉన్నతి కోసం అహరహం శ్రమించిన తన తల్లిదండ్రులు, సోదరునికి ఈ విజయం అంకితమని చెప్పాడు.

➡️