ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం

స్వేచ్ఛాయుత వాతావరణం

మాట్లాడుతున్న కేంద్ర ఎన్నికల పరిశీలకులు శేఖర్‌ విద్యార్థి

  • కేంద్ర ఎన్నికల పరిశీలకులు శేఖర్‌ విద్యార్థి

ప్రజాశక్తి – శ్రీకాకుళం

స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల (సూక్ష్మ పరిశీలకులు) పాత్ర కీలకమని కేంద్ర ఎన్నికల పరిశీలకులు శేఖర్‌ విద్యార్థి అన్నారు. పోలింగ్‌ తీరును గుర్తించడంలో వారు ఇచ్చే నివేదిక ఎంతో ముఖ్యమన్నారు. నగరంలోని అంబేద్కర్‌ ఆడిటోరియంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అధ్యక్షతన మైక్రో అబ్జర్వర్లకు గురువారం నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్‌ విధానాన్ని పరిశీలిస్తూ ఎక్కడైనా తప్పిదాలు, ఉల్లంఘనలు జరిగితే వెంటనే రిటర్నింగ్‌ అధికారి, ఎన్నికల పరిశీలకుల దష్టికి తీసుకురావాలన్నారు. పోలింగ్‌కు గంట ముందు మాక్‌ పోలింగ్‌ నిర్వహించాలని, అభ్యర్థికి ఒక పోలింగ్‌ ఏజెంట్‌ మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటూ, ఓటర్లు వరుస క్రమంలో వచ్చేలా చూడాలన్నారు. పోలింగ్‌ విధానాన్ని పరిశీలించి మైక్రో అబ్జర్వర్లకు ఇచ్చిన ఫార్మాట్‌లోనే నివేదిక సమర్పించాలని చెప్పారు.ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు తలత్‌ ఫర్వేజ్‌ ఇక్బాల్‌ రొహెల్ల మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రంలో సిబ్బంది ఎన్నికల నియమావళి పాటిస్తున్నారో, లేదో చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎటువంటి ఘర్షణలు, రీ పోలింగ్‌ పరిస్థితులు తలెత్తకుండా స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ ప్రక్రియ, ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లు, వెబ్‌ కెమెరాలు ఏర్పాటు చేసిన విధానం, మాక్‌ పోలింగ్‌ నిర్వహణ, ఇవిఎంల అనుసంధానం తదితర అంశాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన చెక్‌లిస్ట్‌ను మైక్రో అబ్జర్వర్లు నిర్లక్ష్యం లేకుండా అనుసరించాలన్నారు. కార్యక్రమంలో ఎల్‌డిఎం సూర్యకిరణ్‌, శ్రీకాకుళం ఆర్‌ఒ సిహెచ్‌.రంగయ్య, ఉద్యానశాఖ అధికారి ప్రసాద్‌, డ్వామా, మెప్మా పీడీలు చిట్టిరాజు, కిరణ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️