అందరికీ ఊ కొట్టారు

ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండగ

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండగ మరో రెండు రోజుల్లో ముగియనుంది. జిల్లాలో సుమారు 60 రోజులుగా సాగిన ప్రచారంలో ఓటర్ల చుట్టూ అభ్యర్థులు తిరిగారు. ఓటర్ల కరుణా కటాక్షం కోసం పరితపించారు. ప్రధాన పార్టీ అభ్యర్థులు చావోరేవో అన్నట్లుగా ప్రచారం చేశారు. ఇంట్లో ఎసి, బయటకు వస్తే ఎసి వాహనాల్లో తిరిగే అభ్యర్థులు మండుటెండను సైతం లెక్క చేయలేదు. చెమటలు కక్కుతూనే ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ పని ప్రదేశాల వద్ద ప్రచారం నిర్వహించడంతో, ఎండలో వారు పడుతున్న కష్టం రాజకీయ పార్టీలకు ప్రధానంగా వైసిపి, టిడిపి నాయకులకు బోధపడి ఉంటుంది. నరసన్నపేట వైసిపి అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్‌ డిప్యూటీ సిఎంగా ఉన్న సందర్భంలో చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటుంది. చెరువు గట్లపై కూర్చొని పని చేయకుండానే డబ్బులు తీసుకుంటున్నారని, ఉపాధి హామీ వృథా అని అప్పట్లో వ్యాఖ్యానించారు. కొందరు అభ్యర్థులు వినూత్న ప్రచారాలు చేపట్టారు. శ్రీకాకుళం అభ్యర్థి గొండు శంకర్‌ శ్రీకాకుళం నగరంలోని ఓ ఇంటికి వెళ్లి చింతపండు పిక్క తీశారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు మేకపిల్లను మెడలో వేసుకుని గొర్రెల కాపరి అవతారం ఎత్తారు. మరికొందరు హోటల్‌లో టీ చేయడం, నూడిల్స్‌ చేయడం వంటి పనులు చేశారు. ప్రచారం సందర్భంగా పలు వృత్తుల వారిని, పలు రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను కలుసుకున్నారు. వారి కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అభ్యర్థులు అక్కడ్నుంచి వెళ్లిన తర్వాత వీరేం మా కష్టాలు తీరుస్తారు, ఎన్నికలైన తర్వాత వీరు కనిపిస్తారా అంటూ నిట్టూర్చారు. ప్రజల్లో చైతన్యం రావడంతో, ఇటువంటి విన్యాసాలను నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. వైసిపి, టిడిపి అభ్యర్థులు ఎవరు వెళ్లినా అందరికీ ఓటర్లు ఊ కొట్టారు. వీరిలో ఎవరికి జై కొడతారన్నది చూడాల్సి ఉంది.ఈసారి ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థుల తరుపున వారి కుటుంబసభ్యులూ విస్తృతంగా తిరిగారు. కొత్తగా బరిలో నిలిచిన వారు అసెంబ్లీలో అడుగుపెట్టాలని మరింత కష్టపడి పనిచేశారు. గతంలో ఓటమిపాలైన వారు ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ప్రచారం చేశారు. తమ పార్టీలు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలను జనంలోకి తీసుకువెళ్లారు. అవి ఎంతవరకు వారిని గట్టెక్కిస్తాయన్నది చూడాల్సి ఉంది. అధికారం కోసం పరితపిస్తున్న వైసిపి, టిడిపి అభ్యర్థులెవరూ జిల్లాలోని ప్రధాన సమస్యలను ప్రస్తావించిన పాపాన పోలేదు. ఆమదాలవలస చక్కెర పరిశ్రమను సహకార రంగంలో తెరిపించే అంశం ఎన్నికల్లో ప్రధాన అజెండాగా ఉండేది. ఈసారి ఎన్నికల్లో దాని ఊసే లేకుండా పోయింది. ఆమదాలవలస రోడ్‌షోలో పాల్గొన్న చంద్రబాబు దానిపై కనీస ప్రస్తావన కూడా చేయలేదు. కూలదోసిన కోడిరామ్మూర్తి స్టేడియాన్ని కొత్తగా నిర్మాణం చేపట్టే విషయంలో వైసిపి అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు, టిడిపి అభ్యర్థి గొండు శంకర్‌ నోట నుంచి కనీసం మాట రాలేదు. అర్ధాంతరంగా ఆపేసిన శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డు ఎప్పుడు పూర్తి చేస్తారో ఎవరూ చెప్పలేకపోయారు. జీడి పిక్కలకు సంబంధించి మద్దతు ధరపై పలాస అభ్యర్ధి గౌతు శిరీష అక్కడక్కడా మాట్లాడినా, వైసిపి అభ్యర్థి సీదిరి అప్పలరాజు మాటమాత్రంగానైనా హామీ ఇవ్వలేదు. జిల్లాలో ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న వంశధార ఫేజ్‌-2 స్టేజ్‌-2, ఆఫ్‌షోర్‌ వంటి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఎవరూ తమ ప్రచారంలో చెప్పకపోవడం, ఆ అంశాన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదు.ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ పార్టీ అభ్యర్థుల తరుపున చేసిన ప్రచారంలోనూ ఇచ్చిన హామీలు జనాన్ని ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. జిల్లాలో రెండు పర్యాయాలు ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తన ఐదేళ్ల కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రసంగించారు తప్ప జిల్లా అభివృద్ధికి ఏం చేయదలుచుకున్నారో ఒక్క మాట చెప్పలేదు. మూడు పర్యాయాలు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు ఇచ్చిన హామీలు చూస్తే చాంతాడంత ఉంటుంది. ప్రచారం చేపట్టిన ప్రతి ప్రాంతానికీ తెగ హామీలు గుప్పించారు. వీటిని జనం ఎంతవరకు నమ్మారని తెలుసుకోవాలంటే, వచ్చే నెల నాలుగో తేదీన చేపట్టే ఓట్ల లెక్కింపు వరకు నిరీక్షించాల్సిందే..!

➡️