ఆ పార్టీలను ఓడించాలి

రాష్ట్రానికి అన్యాయం

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు

  • ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించండి
  • సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపితో పొత్తు పెట్టుకున్న టిడిపి, జనసేన… తొత్తుగా వ్యవహరిస్తున్న వైసిపిని ఈ ఎన్నికల్లో ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధికి ఇండియా ఫోరం బలపరిచిన కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కొవ్వాడలో అణుపార్కు పెట్టి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. మానవ తప్పిదం వల్ల గానీ, యంత్ర లోపం వల్ల ఏ చిన్న ప్రమాదం సంభవించినా ఇటు కాకినాడ నుంచి అటు ఒడిశాలోని ఛత్రపూర్‌ వరకు సమస్త జీవకోటి సర్వనాశనమైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, ఫెడరల్‌ వ్యవస్థను ఒక పధకం ప్రకారం బిజెపి ధ్వంసం చేస్తోందని విమర్శించారు. ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేస్తోందన్నారు. బిజెపి ప్రభుత్వ విధానాలతో పరిశ్రమలు మూతపడి, కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ హక్కుల చట్టాన్ని రద్దు చేసి గిరిజనుల భూములకు రక్షణ లేకుండా చేసిందని చెప్పారు. కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా చేసిందని విమర్శించారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో టిడిపి, జనసేన జత కట్టడం ఎవరికి మోసం చేయడానికని ప్రశ్నించారు. సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.నాగమణి పాల్గొన్నారు.

➡️