పట్టణ ప్రజల దాహార్తి తీరేనా !

పురపాలక సంఘంలోని 23 వార్డుల్లో శివారు వార్డుల ప్రజలకు

పార్వతీశంపేట వద్ద మూలకు చేరిన పైపులు

తాగునీటి కోసం శివారు వార్డు ప్రజల ఎదురుచూపులు

మాటలకే పరిమితమైన పాలకులు

పట్టించుకోని అధికార యంత్రాంగం

ప్రజాశక్తి- ఆమదాలవలస

పురపాలక సంఘంలోని 23 వార్డుల్లో శివారు వార్డుల ప్రజలకు తాగునీరు ఎండమావిలా తయారయ్యింది. శివారు వార్డులైన ఒకటవ వార్డు పరిధిలోని తిమ్మాపురం, జగ్గుశాస్ట్రుల పేట, పార్వతీశంపేట, నాలుగో వార్డు పరిధిలోని గేదెలవానిపేట, కసింవలస, ఐదవ వార్డు పరిధిలోని రెడ్డి పేట, సొట్టవాని పేట, పంతులపేట, ఆరవ వార్డు పరిధిలోని సప్తపురాలైన నందగిరిపేట, తురకపేట, పంతులుపేట, తెలగ మనయ్యపేట, కాళింగ మన్నయ్యపేట, ఏడవ వార్డు పరిధిలోని చింతాడ, చింతాడ కాలనీ, 21వ వార్డు పరిధిలో కుద్దిరాం, మెట్టెక్కి వలసలోని కొన్ని ప్రాంతాల్లో నేటికీ మంచినీటి కుళాయిలు లేక ట్రాక్టర్లతో అరకొరగా ఆ వార్డుల్లోని ప్రజలకు మున్సిపల్‌ అధికారులు తాగునీరు అందిస్తున్నారు. సమితిల పాలన కాలం నుంచి నేటివరకు ప్రజలకు తాగునీరు అందించలేని దౌర్భాగ్యపు స్థితిలో పాలకులు ఉండడం సిగ్గుచేటని పలువురు విమర్శిస్తున్నారు. ప్రజలకు తాగునీరు అందించే పేరుతో అధికారులు ట్రాక్టర్లు రిపేర్ల పేరుతో నిధులను స్వాహా చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా నిత్యం నీరందించకుండా మూడు రోజులకు ఒకసారి నీటిని పంపిణీ చేస్తున్నారని ఆయా వార్డుల మహిళలు వాపోతున్నారు. అన్ని వార్డుల ప్రజలు చెల్లించినట్లే తాము కూడా మున్సిపాలిటీకి పన్నులు చెల్లిస్తున్నామని, తమకు పూర్తిస్థాయిలో తాగునీటిని అందించలేక అధికారులు చేతులెత్తేస్తున్నారని, దీంతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 40 వేలకు పైగా జనాభా ఉన్న మున్సిపాలిటీలో నీటి సరఫరా కలగానే మిగిలిందని పట్టణ ప్రజలు పాలకులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల దాహర్తిని తీర్చేందుకు పట్టణ ప్రణాళిక విభాగం కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపుతున్నప్పటికీ ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన అరకొర నిధులను మంజూరు చేయడంతో ప్రజలకు అందాల్సిన నీటి పథకాలు అట్టడుగు స్థాయిలోనే నిలిచిపోతున్నాయి. ఒకపక్క నిధులు విడుదలవు తున్నప్పటికీ ప్రణాళిక బద్ధంగా ప్రజలకు తాగునీరు అందించడంలో వరుస వైఫల్యాలు ఎదురవుతున్నాయి. 2018లో రూ.40 కోట్లుతో పట్టణ శివారు వార్డులకు తాగునీరు అందించేందుకు నిధులు మంజూరైనప్పటికీ కార్యరూపం దాల్చక ఆ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. 2019లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గత ప్రభుత్వ పథకాలను పూర్తిగా నిలిపి వేయడంతో శివారు వార్డుల ప్రజలకు తాగునీటి కల కలగానే మిగిలిపోయింది. ఒక వ్యక్తికి సుమారు 120 నుంచి 150 లీటర్ల తాగునీరును అందించాల్సి ఉన్నప్పటికీ అందించ లేకపోతున్నారు. దాండ్రాసి మెట్ట, మున్సిపల్‌ కార్యాలయం వద్ద మంచి నీటి ట్యాంకులు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో మంచి నీటిని అందించలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటు వంశధార నది నుంచి వచ్చిన నీరు మెట్టెక్కివలస, కృష్ణాపురం, మార్కెట్‌, గేటు, వెంగళరావు కాలనీ వంటి ప్రాంతాలకు సరఫరా అవుతుంది. అటు నాగావళి నది నుంచి వచ్చిన నీరు లక్ష్ముడు పేట, వెంకయ్య పేట, బొడ్డేపల్లి పేట వంటి వార్డులకు సరఫరా అవుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో మంచి నీటిని ప్రజలకు అధికారులు అందించలేకపోతున్నారు. వంశధార నాగావళి నదులు వద్ద ఉన్న పంపుసెట్ల మోటార్ల సామర్థ్యం చాలడం లేదని ఒక్కోసారి మోటార్లు మొరాయిస్తే ఒకటి రెండు రోజులు వార్డులకు మంచినీటి సరఫరా నిలిచిపోతుంది. దీనికి తోడు పట్టణంలో సగానికి పైగా బడాబాబులు కొళాయిలకు మోటార్లు పెట్టి నీటి చౌర్యం చేస్తున్నప్పటికీ రాజకీయ ఒత్తిడులతో మున్సిపల్‌ అధికారులు పూర్తిస్థాయిలో నియంత్రణ చేయలేక చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాండ్రాసి మెట్ట వద్ద మూడు ట్యాంకులు 1200 కెఎల్‌ఆర్‌, మున్సిపల్‌ ఆఫీసు వద్ద ఉన్న ఒక ట్యాంకు 500 కెఎల్‌ఆర్‌, వెంకయ్యపేట వద్ద ఉన్న నీటి ట్యాంకు 250 కెఎల్‌ఆర్‌ సామర్థ్యం కలిగి ఉన్నాయి. హుదూద్‌ పట్టణ గృహ నిర్మాణ పథకం తిమ్మాపురం వద్ద 512 జి ప్లస్‌ వన్‌ గృహాలకుగాను రూ.కోటి 33 లక్షలతో మంచినీటి ట్యాంకు నిర్మించినప్పటికీ నీరు అక్కడకు సరఫరాకాక ఆ ట్యాంకు నిరూపయోగంగా మారింది. నేటికీ శివారు వార్డులైన 1,4,5,6,7 వార్డులకు మంచినీటి కొళాయిలు లేక మూడు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా మున్సిపల్‌ అధికారులు అక్కడి ప్రజలకు మంచినీటి సరఫరా చేస్తున్నారు. గతంలో టిడిపి హయాంలో అప్పటి ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు సుమారు రూ.33 కోట్లతో శంకుస్థాపన చేసినప్పటికీ అవి కూడా పనులు ప్రారంభం కాక మధ్యలోనే నిలిచిపోయాయి. అలాగే 2020 సంవత్సరంలో ప్రస్తుత స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఎఐఐబి నిధులతో 61.38 కోట్లతో అన్ని వార్డులకు మంచినీటి సదుపాయం కల్పించి ఇంటి కొళాయి కనెక్షన్లకు ఎఎంఆర్‌ మీటర్లు అమర్చుటకు పట్టణంలో పాలపాలమ్మ గుడివద్ద శంకుస్థాపన చేశారు. ఆ పనులు కూడా ఆదిలోనే ప్రారంభమై నిలిచిపోవడంతో పట్టణ ప్రజల నీటి కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి. మున్సిపాలిటీ ఏర్పడి నేటికి 30 ఏళ్లు కావస్తున్నప్పటికీ ప్రజలపై పన్నుల భారం పెరిగిందే తప్పా ప్రజల కనీస అవసరమైన మంచినీటి కష్టాలు మాత్రం తీరడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు ్ల మాటలు కట్టిపెట్టి ప్రజలకు కనీస అవసరమైన తాగు నీటిని చిత్తశుద్ధితో అందించాలని కోరుతున్నారు.

నీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం

గడచిన కొన్నేళ్లుగా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం. పాలకులు, అధికారులు హామీలే తప్పా పూర్తిస్థాయిలో నేటి వరకు సమస్యను పరిష్కరించ లేకపోయారు. ఒక్కోసారి రెండు మూడు రోజులు కొళాయిలు రాకపోవడంతో మంచి నీటిని కొనుగోలు చేసుకుంటున్నాం. దుప్పల పద్మావతి, పాతినవారి వీధి, ఆమదాలవలస

శిలాఫలకాలకే పరిమితం

సమితుల కాలం నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెందినప్పటికీ పాలకులు తాగునీటి విషయంలో ప్రజలను మోసం చేశారు. నాయకులు ఎన్నికల ముందు ఉపన్యాసాలు ఇచ్చి ఎన్నికలయ్యాక తాగునీటి సమస్యను శిలాఫలకాలకే పరిమితం చేస్తున్నారు. పాలకులు చిత్తశుద్ధితో సమస్యను పరిష్కరించాలి. బొడ్డేపల్లి జనార్థనరావు, పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి

 

➡️