సిబ్బంది లేక ఇబ్బంది

May 18,2024 20:40

వ్యవసాయానికి రంగానికి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో సర్కారు రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చింది. ప్రతి సచివాలయం పరిధిలో ఆర్‌బికెలను ఏర్పాటుచేసింది. ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఒక అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌, వెటర్నరీ అసిస్టెంట్‌ను నియమిస్తామని ప్రకటించింది. మెరాన్‌ లేక చెరువు ప్రాంతంలో ఉంటే ఫిషరీస్‌ అసిస్టెంట్‌ను నియమిస్తామంది. దీనిలో భాగంగా సీతంపేట ఏజెన్సీలో 29 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. కానీ పూర్తిస్థాయిలో అగ్రికల్చర్‌, వెటర్నరీ అసిస్టెంట్లను నియమించడం మరిచింది. దీంతో ఒక్కొక్కరికి రెండు లేక మూడు రైతు భరోసా కేంద్రాల ఇన్‌ఛార్జి బాధ్యతలు అదనంగా అప్పగించింది. తలకు మించిన భారమై దేనికీ న్యాయం చేయలేని పరిస్థితి నెలకొంది.

ప్రజాశక్తి-సీతంపేట: జిల్లాలో కొద్దిరోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. సీతంపేట మండలంలో సుమారు 25 వేల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. దాదాపు 15 వేల మంది రైతులు సాగు చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. సీతంపేట మండలంలో 29 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుచేసినా, వీటిలో ఆరు గ్రామ వ్యవసాయ సహాయకులు (విఎఎ) పోస్టులు, 23 గ్రామ ఉద్యాన శాఖ సహాయకుల పోస్టులు మంజూరు చేశారు. ఆరుగురు విఎఎలకు ఐదుగురు రెగ్యులర్‌గా ఉన్నారు. నలుగురిని డెప్యుటేషన్‌ పద్ధతిలో నియమించారు. హార్టికల్చర్‌ అసిస్టెంట్ల పోస్టులు పూర్తిగా భర్తీచేయలేదు. ఇద్దరు హార్టికల్చర్‌ అసిస్టెంట్లను డెప్యుటేషన్‌ పద్ధతిలో తీసుకొచ్చారు. 29 రైతు భరోసా కేంద్రాలకు గాను 9 విఎఎలు, ఇద్దరు విహెచ్‌ఎలు… మొత్తం 11 మందికి వ్యవసాయ కార్యకలాపాల బాధ్యతలు అప్పగించడంతో తలకు మించిన భారమై తలలు పట్టుకుంటున్నారు. డెప్యుటేషన్‌ పద్ధతిలో ఉన్న విహెచ్‌ఎ, విఎఎలు ఎప్పుడు వెనక్కి వెళ్లిపోతారేమోనని ఉన్న సిబ్బంది కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఒక్కొక్కరికి రెండు లేక మూడు రైతు భరోసా కేంద్రాలకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు.ఈ నెలాఖరిలో కట్టెలు, జీలుగు, పిల్లి పెసర విత్తనాలను రైతులకు పంపిణీ చేయాలి. తద్వారా భూసారానికి ఎంతో ఉపయోగపడుతుందని రైతులకు అవగాహన కల్పించాలి. జూన్‌ రెండో వారంలో ఖరీఫ్‌లో రైతులకు కావాల్సిన విత్తనాలు సబ్సిడీలో అందజేయాలి. నారుమడులు పొలాల్లో వేశారా? లేదా? పరిశీలించాలి. జూలైలో గిరిజన రైతులకు యూరియా, డిఎపి, పొటాషియం వంటి ఎరువులు చేరవేయాలి. యాంత్రిక పనిముట్లు ప్రభుత్వం నుండి సరఫరా అయితే రైతులకు తెలియజేయాలి. జూలై చివరి వారం నుంచి నవంబర్‌ వరకు పంట నమోదు ప్రక్రియ నిర్వహించాలి. నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 10 వరకు ఇకెవైసి నమోదు చేయాలి. ఈ మధ్య కాలంలో పంట కోత ప్రయోగాలు చేపట్టి, దిగుబడి అంచనాలను పరిశీలించి అధికారులకు ఇవ్వాలి. డిసెంబర్‌ రెండో వారం నుంచి ఫిబ్రవరి వరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఉంటుంది. దాంతోపాటు ప్రభుత్వం రాయితీలు, రైతు భరోసా పథకాల గురించి తెలియజేయాలి. ఇవన్నీ చేయాలంటే ఉన్న కొద్దిమంది సిబ్బందిపై పనిభారంతో తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఎఒ వివరణఈ విషయంపై మండల వ్యవసాయ అధికారి పి.శ్రీదేవి వద్ద ప్రస్తావించగా 23 హార్టికల్చర్‌ అసిస్టెంటు, ఆరు అగ్రికల్చర్‌ అసిస్టెంటు పోస్టులు మంజూరుచేశారని తెలిపారు. అర్హత ఉన్న హార్టికల్చర్‌ అసిస్టెంట్లు లేకపోవడంతో భర్తీ చేయలేకపోతున్నారని చెప్పారు. ఈ ఖరీఫ్‌ సీజన్లో సిబ్బంది లేకపోవడం మరింత పనిభారం ఉన్న సిబ్బందిపై పడుతుందని సమాధానం ఇచ్చారు.

➡️