టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి : దామచర్ల

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : – టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, రానున్న ఎన్నికలలో టిడిపి అభ్యర్థులను గెలిపించాలని టిడిపి కూటమి ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్ధనరావు పిలుపునిచ్చారు. స్థానిక త్రోవగుంటలో పిడిసిసి బ్యాంకు మాజీ ఛైర్మన్‌ కండే శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్ధనరావు, జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా దామచర్ల జనార్ధనరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పదేళ్ళు వెనక్కి పోయిందన్నారు. ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయించటం, జైలు పాలు చేశారన్నారు. అన్ని వ్యవస్ధలను జగన్‌ రెడ్డి నాశనం చేశారన్నారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదన్నారు. ధన బలం చూసుకొని ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు చేపట్టారని, పోలీసులు సైతం ఆయనకు అండగా ఉన్నారన్నారు. ఇటువంటి పరిస్థితులలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకొని అభివృద్ధికి చిరునామాగా నిలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు టిడిపిలో చేరారు. దామచర్ల జనార్ధనరావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్‌ రియాజ్‌, టిడిపి నాయకులు మంత్రి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్‌ రెడ్డి, వై.శశికాంత్‌భూషణ్‌, కామేపల్లి శ్రీనివాసరావు, కమ్మ వెంకటేశ్వర్లు, చెన్నుపాటి వేణు, చెన్నుపాటి ప్రసాద్‌, కోలా ప్రభాకర్‌, నావూరి కుమార్‌, మహిళా నాయకురాళ్లు మండువ లావణ్య, అనిత, మలగా రమేష్‌, చిట్టెం ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️