విద్యార్థుల ఖాతాలు అప్‌డేట్‌ చేయాలి

ప్రజాశక్తి-మార్కాపురం: 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సంబంధించిన పైకం తల్లుల ఖాతాల్లో జమ అవుతోందని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎన్‌ లక్ష్మా నాయక్‌ తెలిపారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలపై స్థానిక వేమన బాలికల డిగ్రీ కళాశాలలో మంగళవారం సమావేశం జరిగిం ది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా దీవెన నగదును సంబంధిత కళాశాలలకు జమ చేయని వారి తల్లుల ఖాతాలకు సంబం ధించి నవశకం లాగిన్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన నోటీసును వారికి అందజేసి లాగిన్‌లో అప్‌డేట్‌ చేయాలన్నారు. గడిచిన త్రైమాసికంలో విడుదలైన నిధులను కళాశాలలకు చెల్లించని తల్లులకు ఫీజు కళాశాలకు చెల్లించే విధంగా విద్యార్థుల తల్లులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి నవశకం లాగిన్‌లో అప్‌డేట్‌ చేయాలన్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐడు విడుదల పరిశీలన పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి కారణాలను నవశకం లాగిన్‌లో అప్‌డేట్‌ చేయాలన్నారు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి (నాలుగో త్రైమాసికం) కళాశాలలకు ఫీజు చెల్లించని తల్లులకు నోటీసులు అందజేయాలని, వారి వివరాలు సెక్రటేరియట్‌కు నవశకం లాగిన్‌లో అప్‌డేట్‌ చేసుకోవాలన్నారు. ఎన్‌పిసిఐ పెండింగ్‌ ఉన్న ఎస్‌సి విద్యార్థుల ఆధార్‌ నెంబరును బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాలన్నారు. పై అంశాలకు సంబంధించి త్వరితగతిన నిర్ణీత సమయంలో అప్‌డేట్‌ చేయని అధికారులపై శాఖపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశానికి మార్కాపురం ఎఎస్‌డబ్ల్యుఓ ఎన్‌ అరుణకుమారి అధ్యక్షత వహించగా ఇతర ప్రాంతాల ఎఎస్‌డబ్ల్యుఓలు ఎన్‌ అమ్మాజి, ఇ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

➡️