హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణానికి సుస్తీ

Apr 16,2024 21:46

గ్రామీణ ప్రాంతాల్లో రోగులకు వైద్య సేవలందించేందుకు గ్రామాల్లో నిర్మాణం తలపెట్టిన హెల్త్‌ క్లినిక్‌లు నాలుగేళ్లవుతున్నా పూర్తి కాలేదు. దీంతో ఈ ఆరోగ్య ఉప కేంద్రాలు అరకొర వసతులతో అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. ఈ అద్దె కూడా ప్రభుత్వం చెల్లించకపోవడంతో వైద్య సిబ్బంది సొంత నిధులతో అద్దె చెల్లిస్తున్నారు. ఈ అద్దె భవనాలు కూడా ఇరుగ్గా ఉండటంతో వైద్య సిబ్బంది, రోగులు అవస్థలు పడుతున్నారు. వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లు పేరుతో పక్కా భవనాలు పూర్తి కాకపోవడంతో అద్దె కొంపల్లో ఇరుకు గదుల్లో వైద్యం అందించాల్సి వస్తోందని సిబ్బంది వాపోతున్నారు. పైగా ఆరోగ్య కేంద్రాల అద్దెకు ప్రభుత్వం కేవలం రూ. 250 చెల్లించడంతో మిగతా సొమ్మును తామే భరిస్తున్నామని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఈ అద్దె కూడా సకాలంలో చెల్లింకపోవడంతో భారంగా మారిందని ఆరోగ్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అద్దె తక్కువ కావడంతో పూర్తి సదుపాయాలతో కూడిన భవనాలు దొరకని దుస్థితి నెలకొందని, ఇరుగ్గా ఉండే చిన్న గదుల్లోనే వైద్య సేవలు నిర్వహించడంతో పూర్తిస్థాయి వైద్య సేవలు అందడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మండలంలోని వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ (ఆరోగ్య ఉప కేంద్రాలు) దుస్థితిపై ప్రజాశక్తి పరిశీలన కథనం..

ప్రజాశక్తి- రేగిడి: మండలంలోని 39 గ్రామపంచాయతీలలో 25 సచివాలయాల పరిధిలో 22 వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లు మంజూరయ్యాయి. ఒక్కొక్క హెల్త్‌ క్లినిక్‌కు ఉపాధి హామీ పథకం నిధులు రూ.17.50 లక్షలు వెచ్చించారు. ఉపాధి పథకం అనగానే కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఈ హెల్త్‌క్లినిక్‌ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అంబకండి 1, వెంకంపేట పూర్తికాగా, అంబకండి 2 బిల్లులు చాలక మధ్యలోనే నిర్మాణాలు ఆపేశారు. కొన్ని చోట్ల పునాది స్థాయిలోను, ఇంకొన్ని స్థలాలు లేక, మరికొన్ని కట్టడాలు పూర్తికాక అసంపూర్తిగానే ఉండిపోయాయి. నిధులు చాలక కొన్ని, బిల్లులు చెల్లించక మరికొన్ని ఇలా ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.22 ఆరోగ్య ఉప కేంద్రాలకు 2 పూర్తిరేగిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 10 హెల్త్‌ క్లినిక్‌లు, బూరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 12 హెల్త్‌ క్లినిక్‌లు నిర్మాణాలు చేపట్టవలసి ఉంది. అంబకండి 1లో పూర్తి చేసిన ఉపకేంద్రాన్ని ఇటీవల ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌లు ప్రారంభించారు. వెంకంపేటలో కూడా నిర్మాణం పూర్తయింది. మొత్తం 22 భవనాలకు గాను ఇప్పటి వరకూ 2 భవనాలే పూర్తయ్యాయి. మిగతా చోట్ల నిధులు చాలక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా హెల్త్‌ క్లినిక్‌లు తయారయ్యాయి.అద్దె కొంపల్లోనే 12 ఉప కేంద్రాలు నిర్వహణరేగిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 6 ఆరోగ్య ఉప కేంద్రాలు, బూరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మరో 6 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. ఈ ఉపకేంద్రాలకు పక్కా భవనాలు లేక అద్దె భవనాల్లోనే కొనసాగుతూ వైద్య సేవలు ఇరుగు గదిలోనే నిర్వహిస్తున్నారు. ఈ అద్దె భవనాల్లో ఉన్న ఉపకేంద్రాలకు అరకొర అద్దెలు ప్రభుత్వాలు ఇస్తూ, సరైన సదుపాయాలు లేక కొన్నిచోట్ల పూరి పాకాల్లోనూ, మరికొన్ని చోట్ల పెంకుటింటలోనూ, ఇంకొన్నిచోట్ల డాబాలలోను ఉపకేంద్రాలను నడుస్తున్నాయి. ఇరుకు గదుల్లోనే సిబ్బంది విధులు నిర్వహించటంతో రోగులకు సరైన సదుపాయాలు లేని దుస్థితి కనిపిస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందకపోవటంతో ఇటు సిబ్బంది, అటు రోగులు నానా అవస్థలు పడుతున్నారు. అద్దె చెల్లిస్తున్న ఎఎన్‌ఎంలుప్రస్తుతం హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణాలు చేపట్టడంతో ఉన్న ఉపకేంద్రాలకు ప్రభుత్వం అద్దె చెల్లించక ఉప కేంద్రాల పరిధి ఏఎన్‌ఎంలే సర్దుబాటు చేస్తూ ఉప కేంద్రాలు నడిపిస్తున్నారు. వారికి వచ్చిన జీతం డబ్బులో కొంత అద్దెకు చెల్లించి కేంద్రాలను నడిపిస్తున్నారు. ప్రభుత్వాలు అద్దె చెల్లించకపోవడంతో ఎలా నడిపిస్తు న్నారని ప్రశ్నిస్తే చెప్పేందుకు వైద్య సిబ్బంది నిరాకరిస్తున్నారు. మూడేళ్లుగడిచిన హెల్త్‌ క్లినిక్‌లు ఇంతవరకు పూర్తి కాకపోవటంతో ఉప కేంద్రాలు అద్దె లేకుండా ఎలా నడిపేదని వైద్య సిబ్బంది వాపోతున్నారు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు దృష్టి సారించి హెల్త్‌ క్లినిక్‌లు పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదువైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లు నిర్మాణాలకు నిధులు చాలడం లేదని కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. మండలానికి 22 వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లు మంజూరయ్యాయి. ఒక్కొక్క హెల్త్‌ క్లినిక్‌ నిర్మాణానికి ఉపాధి నిధులు రూ.17.50 లక్షలు కేటాయించాం. ప్రస్తుత రేట్లు ప్రకారం నిధులు చాలక కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అంబకండి.1, వెంకంపేట హెల్త్‌ క్లినిక్‌లు మాత్రమే పూర్తయ్యాయి. అంబకండి 2 నిధులు చాలక ఆపేశారు. స్థానిక నాయకులను ఒప్పించి నిర్మాణాలకు చర్యలు తీసుకున్నాం. నిధులు చాలని విషయాన్ని ఉన్నత అధికారులకు తెలియజేశాం. అదనంగా మంజూరు అయితే నిర్మాణాలు వేగవంతం అవుతాయి.- శ్యామల కుమారి ఎంపిడిఒ రేగిడి

➡️