లోకేష్‌ డబ్బు తీసుకుని వైసిపికి ఓటేయండి

Apr 14,2024 00:18

సిఎం జగన్‌కు చేనేత వస్త్రాలు బహూకరిస్తున్న వైసిపి మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.లావణ్య, ఎమ్మెల్సీ హనుమంతరావు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాజధానిలో పేద లకు సెంటు స్థలం ఇస్తే ఓర్వలేని చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నాడని సిఎం జగన విమర్శించారు. పేదలకు ఏదో ఉద్దరించానన్న చంద్రబాబు రాజధానిలో పేదలకు చేసిన మేలు ఎమిటో చెప్పాలన్నారు. మంగళగిరిలోని సికె కన్వెన్షన్‌ హాలులో శనివారం జరిగిన చేనేత కార్మికుల ముఖాముఖి సదస్సులోఆయన పాల్గొన్నారు. ఇంటిస్థలాలు ఇవ్వకుండా అడ్డుకున్న చంద్రబాబును ప్రజలు ఎన్నికల ప్రచారంలో నిలదీయాలన్నారు. చంద్రబాబుకు ఉన్న నెగిటివిటీ అనుభవం నాకు లేదన్నారు. ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలని, 58 నెలలో తాను ఇచ్చిన సంక్షేమ పథకాలు టిడిపి హయాంలో ఎప్పుడైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతామన్నారు. చేనేత కార్మికులకు అండగా ఉంటానన్న చంద్రబాబు మాటతప్పారని తాను అన్ని హామీలను అమలు చేశానన్నారు. రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు విషయం జాగ్రత్తగా ఉండాలన్నారు. పేదలకు మంచి జరిగితే అడ్డుకునే వాడు రాజకీయ నాయకుడా? అని వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోలో చెప్పే ప్రతీ హామీని నెరవేర్చిన వైసిపిని విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. బిసిల సీటును లాక్కునేందుకు చంద్రబాబు, లోకేష్‌ ద్వారా ప్రయత్నిస్తున్నారని, లోకేష్‌ ఓటుకు రూ.ఐదారే వేలు ఇస్తారని, ఆ డబ్బు ఇస్తే తీసుకుని ఓటుమాత్రం వైసిపికి వేయాలని అన్నారు. అంతకు ముందు జగన్‌ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 14వ రోజు నంబూరు బైపాస్‌ నుంచి ప్రారంభమైంది. ప్రజలు జననేత వైయస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. దాదాపు వారంరోజులపాటు కొనసాగిన బస్సుయాత్ర శనివారం తాడేపల్లి వద్ద ముగిసింది. ఈ సందర్భంగా నంబూరు నుంచి తాడేపల్లి వరకు జరిగిన బస్సు యాత్రలో వైసిపి కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గుంటూరు లోక్‌సభ అభ్యర్థి కిలారి రోశయ్య, మంగళగిరి అభ్యర్థి మురుగుడు లావణ్య పాల్గొన్నారు.

➡️