వ్యాధుల నియంత్రణకు చర్యలు : సర్పంచి

ప్రజాశక్తి- మద్దిపాడు : నీటి ద్వారా సంక్రమించే డయే రియా, టైఫాయిడ్‌ లాంటి వ్యాధులను నియంత్రించుటకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సర్పంచి దాసరి శిల్పా సౌందర్య తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత పై ప్రజలలో అవగాహన కలిగించే కార్యక్రమంలో భాగంగా ఏడుగుండ్లపాడులోని తాగునీటి బావులలో మంగళవారం క్లోరినేషన్‌ చేశారు. మద్దిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ శ్రవణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో హెల్త్‌ సూపర్‌ వైజర్‌ కె. బాలకోటయ్య పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ నీటిలోని బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను చంపటానికి క్లోరినేషన్‌ చేస్తారని తెలిపారు. నీటిలో క్లోరినేషన్‌ చేసిన అర్థగంట తరువాత అవశేష క్లోరిన్‌ 0.2 పిపిఎం ఉండే విధంగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ గురువర్ధని, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ సాయి, గ్రామ పెద్దలు ఎం. వెంకటస్వామి, డి. రమేష్‌, హెల్త్‌ వెల్నెస్‌సెంటర్‌ సిబ్బంది పాల్గొన్నారు

➡️