బుద్ధుని మార్గం అనుసరణీయం

May 24,2024 00:04

ప్రజాశక్తి – ఎఎన్‌యు : నేటి సమాజానికి దిక్సూచిగా బౌద్ధం నిలుస్తుందని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ పి.రాజశేఖర్‌ అన్నారు. వర్సిటీలోని బౌద్ధ అధ్యయన విభాగం ఆధ్వర్యంలో గురువారం బుద్ధ పూర్ణిమ వేడుకలు జరిగాయి. వీసీ మాట్లాడుతూ బుద్ధ పూర్ణిమ, బౌద్ధ ధర్మం విశిష్టత ఎంతో గొప్పదని, బుద్ధుని ధమ్మ విషయాలు ఆచరణ యోగ్యమైనవని, అవి సమాజానికి ఎంతో మార్గదర్శనంగా నిలుస్తాయి అన్నారు. బౌద్ధ సిద్ధాంతాలు నేటి యువత అలవర్చుకొని రాణించాలని, జీవిత లక్ష్యాలను సాధించే క్రమంలో శాంతి, సహనం, కషి, పట్టుదల వంటివి అలవర్చుకోవాలని సూచించారు. బౌద్ధ అధ్యయన విభాగ అధిపతి ప్రొఫెసర్‌ ఎల్‌.ఉదరుకుమార్‌ మాట్లాడుతూ బౌద్ధ జయంతి ప్రాముఖ్యత అధ్యయనం గురించి వివరించారు. కార్యక్రమంలో సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ గంగాధరరావు, సిడిసి డిన్‌ కె.మధుబాబు, విదేశీ విద్యార్థుల విభాగం డైరెక్టర్‌ జి.చెన్నారెడ్డి, దూరవిద్య పరీక్షల విభాగ సమన్వయకర్త డాక్టర్‌ కె.సోమశేఖర్‌ పాల్గొన్నారు.
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : దేశం ఎదుర్కొంటున్న అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యల పరిష్కారానికి బుద్ధుని మార్గం అనుసరణీయమని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. గుంటూరులోని విజేత కాన్సెప్ట్‌ స్కూల్‌లో బుద్ధ జయంతి వేడుకలు జరిగాయి. సభకు సెంటర్‌ ఫర్‌ సోషల్‌ సైకాలజీ అధ్యక్షులు ప్రొఫెసర్‌ ఎన్‌.అరవింద్‌ అధ్యక్షత వహించారు. లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ బౌద్ధ మతం నేడు ప్రపంచంలో నాలుగో పెద్ద మతంగా ఉందని, ప్రపంచ జనాభాలో ఏడు శాతం మంది బౌద్ధ ధర్మాన్ని ఆచరిస్తున్నారని తెలిపారు. బుద్ధుని బోధనలో పంచశీల ముఖ్యమైందని, ప్రాణ హాని చేయరాదని, దొంగతనం ఉండరాదని, అబద్ధ మాడరాదని, వ్యభిచారంను నివారించాలని, మత్తు పానీయాలను నిరోధించాలని 2,600 ఏళ్ల క్రితమే బుద్ధుడు చెప్పాడని వివరించారు. దుఖా:నికి కారణం కోరికలని, వాటిని అధిగమించడానికి అష్టాంగ మార్గాన్ని ఆచరించాలని గౌతమ బుద్ధుడు ప్రబోధించాడని అన్నారు. నేడు ప్రపంచంలో దాదాపు 30 దేశాలలో బౌద్ధం అమలులో వుందన్నారు. ప్రొఫెసర్‌ ఎన్‌. అరవింద్‌ మాట్లాడుతూ పుట్టుకతో సంబంధం లేకుండా ప్రతి మనిషి బుద్ధుడులా జీవించవచ్చని అన్నారు. కార్యక్రమంలో ప్రత్యూష సుబ్బారావు, పి.రమేష్‌, డి.దేవరాజ్‌, ఒ.నారాయణరెడ్డి, మధు, లక్ష్మణరావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి – మంగళగిరి : మానసిక వికాసానికి, వర్తమాన సమాజంలోని సమస్యల పరిష్కారానికి బౌద్ధం దారి చూపుతుందని సెంటర్‌ ఫర్‌ సోషల్‌ సైకాలజీ ప్రెసిడెంట్‌ ప్రొఫెసర్‌ నూతలపాటి అరవింద్‌ అన్నారు. మానవతా వేదిక ఆధ్వర్యంలో మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్‌లోని వైష్ణవి కళ్యాణ మండపంలో గురువారం రాత్రి గౌతమ బుద్ధుని 2568వ జయంతికి వేదిక కన్వీనర్‌ గోలి మధు అధ్యక్షత వహించారు. మంగళగిరి కొత్త విహార అధ్యక్షులు రేఖా కృష్ణార్జునరావు మాట్లాడుతూ కరుణ, మైత్రి పునాదుల మీద విశ్వ శ్రేయస్సుకు దోహదపడే బౌద్ధం అని అన్నారు. సైకాలజిస్ట్‌ డాక్టర్‌ ప్రత్యూష సుబ్బారావు మాట్లాడుతూ నైతికత పునాదుల మీద నడిచేది బౌద్ధమని, నేటి సైకాలజిస్టులలో ఏ ఒక్కరూ బుద్ధుడు మార్గాన్ని కాకుండా ముందుకు వెళ్లలేరని అన్నారు. మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్‌ గుత్తికొండ ధనుంజయరావు మాట్లాడుతూ మానవజాతి మనుగడ, సమాజంలోని రుగ్మతల నిర్మూలనకు బుద్ధుని బోధనలు ఉపయుక్తమన్నారు. ఈ సందర్భంగా అఖిలభారత శరీర అవయవదాతల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గూడూరు సీతామహాలక్ష్మీని సన్మానించారు. పి.రవి, కె.కాశయ్య, కళాధర్‌రెడ్డి, లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు. రచయిత, గాయకులు అల్లక తాతారావు నిర్వహణలో శ్రీ ఉమామహేశ్వర కళాక్షేత్రానికి చెందిన నాట్యాచార్య కందికట్ల వాసుదేవరావు, తీడా బాలకృష్ణ శిష్య బృందం నృత్య ప్రదర్శన, కవి, రచయిత గాయకుడు సందుపట్ల భూపతి ధర్మవిజేత, సామ్రాట్‌ అశోక్‌ ఏకపాత్రాభినయం ఆకట్టుకున్నాయి.స్థానిక ఎస్సీ/ఎస్టీ రైట్‌ అండ్‌ యాక్ట్‌ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ ఆర్మీ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మండల పరిషత్‌ ఆవరణలోని గౌతమ బుద్ధిని విగ్రహం వద్ద బుద్ధ జయంతి నిర్వహించారు. బుద్ధుని ఆశయాలను, మార్గాలను అనుసరించాలని ప్రతిజ్ఞ చేశారు. ట్రస్ట్‌ చైర్మన్‌ కె.రామారావు, సభ్యులు బి.గోవిందరాజు, జి.వెంకయ్య, రామకృష్ణారావు, శివదాసు పాల్గొన్నారు.

➡️