నత్తనడకన ఈ-హెల్త్‌, వెల్‌నెస్‌ సెంటర్‌ నిర్మాణం

Apr 8,2024 00:23

రాజధాని ప్రాంతం తుళ్లూరులో నిర్మాణంలో ఉన్న ఈ – హెల్త్‌, వెల్‌ నెస్‌ సెంటర్‌
ప్రజాశక్తి – తుళ్లూరు :
మండల కేంద్రమైన తుళ్లూరులో ఈ-హెల్త్‌, వెల్‌నెస్‌ సెంటర్‌ నిర్మాణం నత్త నడకన సాగుతోంది. నిర్ధేశిత గడువు పూర్తయినా నిర్మాణం పూర్తి కాలేదు. ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రాజధాని ప్రాంతం కావడంతో ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వం తుళ్లూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రం దగ్గర ఈ-హెల్త్‌, వెల్‌నెస్‌ సెంటర్‌ నిర్మాణం చేపట్టింది. వ్యాధులు రాకుండా ముందుగానే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై అవగాహన కల్పించడంతో పాటు వ్యాధి బారిన పడ్డాక వైద్యం అందించడం ఈ-హెల్త్‌, వెల్‌నెస్‌ సెంటర్‌లో జరుగుతుంది. ఈ-హెల్త్‌, వెల్‌నెస్‌ సెంటర్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ.కోటీ 13 లక్షల 48 వేలు కేటాయించింది. గతేడాది అక్టోబర్‌ 4న శంకుస్థాపన చేశారు. 310.4 చదరపు మీటర్లలో, రెండు అంతస్తులలో (జీ ఫ్లస్‌ 1) నిర్మాణం తలపెట్టారు. ఎస్‌ఆర్‌ ఎడిఫైస్‌ కాంట్రాక్‌ ఏజెన్సీకి నిర్మాణం పనులు అప్పగించారు. పనులు ఈ ఏడాది మార్చి 31 నాటికి పూర్తి కావాల్సి ఉన్నా ఇంతవరకు సగం నిర్మాణం కూడా పూర్తి కాలేదు. పనులు వేగవంతం కూడా కాకపోవడంతో ఎప్పటికి పూర్తవుతుందో అర్థం కావడం లేదు. రాజధాని ప్రాంతం కావడంతో టిడిపి ప్రభుత్వం రూ.4 కోట్లతో సామాజిక ఆరోగ్య కేంద్రం నిర్మించింది. అన్ని వసతులతో భవనం నిర్మాణం జరిగినా అవసరమైన వైద్య సిబ్బందిని మాత్రం నియమించలేదు ప్రస్తుతానికి సామాజిక ఆరోగ్య కేంద్రం (30 పడకల ఆసుపత్రి)లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ-హెల్త్‌, వెల్‌నెస్‌ సెంటర్‌ నిర్మాణం కూడా పూర్తయితే రాజధాని ప్రాంత వాసులకు మరిన్ని వైద్య సేవలు అందించేందుకు వీలుకలు గుతుంది. కాంట్రాక్ట్‌ ఏజెన్సీ అలసత్వం కారణంగా నిర్మాణం నత్తనడక నడుస్తోం దన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు కలుగజేసుకుని పనులు త్వరగా పూర్తి చేయించి అందుబా టులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

➡️