ఇళ్ల పట్టాలు దక్కాలంటే పోరాడే సిపిఎం గెలవాలి

Apr 20,2024 00:41

మంగళగిరిలో సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకరరావుకు స్వాగతం పలికి మద్దతు తెలుపుతున్న ఓటర్లు
ప్రజాశక్తి – మంగళగిరి :
ప్రజల కోసం నిరంతరం పనిచేసే కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరుతూ శుక్రవారం మంగళగిరి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇండియా వేదిక పార్టీలు ప్రచారం చేశాయి. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సిపిఐ, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ బలపరిచిన సిపిఎం అభ్యర్థి జొన్న శివ శంకరరావు, గుంటూరు పార్లమెంట్‌కు సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జంగాల అజరు కుమార్‌ను గెలిపించాలని రత్నాల చెరువు, పాత మంగళగిరి ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. జొన్న శివశంకర్‌కు పలువురు పూలమాలలతో స్వాగతం పలికి తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ మంగళగిరి ప్రాంతంలో అనేక పేదల కాలనీలు కమ్యూనిస్టుల వల్ల ఏర్పడ్డాయని, రత్నాల చెరువులో 6 వేలకుపైగా ఇళ్లను పేదలకు వేయించామని గుర్తు చేశారు. వారందరికీ పట్టాలు రావాలంటే సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకరరావును గెలిపించాలని కోరారు.
డిఫారెస్ట్‌ చేసి పట్టాలు ఇవ్వాలి
మంగళగిరి కొండ పరిసర ప్రాంతాల్లో పేదలు ఇళ్లేసుకుని నివసిస్తున్నారని, వారికి ప్రభుత్వం డి ఫారెస్ట్‌ చేసి పట్టాలివ్వాలని సిపిఎం మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి జొన్నా శివశంకర్రావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరి పట్టణంలోని ఒకటో వార్డులోని సిపిఎం కార్యాలయం నుండి ఇంటింటి ప్రచారం చేపట్టారు. శివశంకర్‌ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఇళ్లేసుకుని నివాసం ఉంటున్నా అటవీ శాఖ అధికారులు వేధింపులు గురి చేస్తున్నారని విమర్శించారు. రిజిస్ట్రేషన్‌పై పెట్టిన నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. పేదల సమస్యలు పరిష్కారం కావాలంటే కమ్యూనిస్టు అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గ కమ్యూనిస్టుల అడ్డా అని అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు కె.జీవన్‌ సాగర్‌ మాట్లాడుతూ ఇండియా వేదిక అభ్యర్థులను రానున్న ఎన్నికల్లో గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్‌ చెంగయ్య, సీనియర్‌ నాయకులు జెవి.రాఘవులు, పి.బాలకృష్ణ, ఎం.పకీరయ్య, సిపిఎం పట్టణ కార్యదర్శి వై.కమలాకర్‌, నాయకులు జవహర్‌లాల్‌, ఎం.బాలాజీ, ఎం.చలపతిరావు, జె.శివభావన్నారాయణ, డి.రామారావు, కె.వెంకటేశ్వరావు, కె.కుమారి, ఎం.రాంబాబు, ఎస్‌.కోటేశ్వరరావు, జి.దుర్గాప్రసాద్‌, ఎస్‌.వెంకటేష్‌, కె.నాగేశ్వరరావు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరపతయ్య, ఎన్‌.బ్రహ్మేశ్వరరావు, జె.జాన్‌బాబు, కె.నరసింహారావు, జి.పట్టాభి, బి.మోహన్‌రావు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కె.రాధిక, కె.చిక్కయ్య, కె.కిషోర్‌, చాంబర్‌ ఆఫ్‌ కామర్‌ కార్యదర్శి వి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ప్రజాశక్తి-తాడేపల్లి : జొన్నా శివశంకరరావు, జంగాల అజరుకుమార్‌లను గెలిపించాలని కెఎల్‌రావు కాలనీ, బోసుబొమ్మ సెంటర్‌ ప్రాంతాల్లో సిపిఎం కార్యకర్తలు విస్తృతంగా కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్‌నగర్‌లో జరిగిన జనరల్‌ బాడీ సమావేశంలో సిపిఎం పట్టణ నాయకులు వేముల దుర్గారావు మాట్లాడుతూ వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బిజెపి మత విభజన రాజకీయాలను తిప్పికొట్టాలన్నారు. ఈ ప్రాంతంలో పేదల ఇళ్లు నిలబడాలన్నా, పట్టాలు రావాలన్నా వామపక్ష అభ్యర్థులను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌కె బాష, కె.మేరి, వి.శామ్యేలు, దర్శనపు విజయబాబు, ఫిరోజ్‌, ఎమ్‌డి బాబ్జి, రహుల్లా పాల్గొన్నారు.
చందు జనార్ధన్‌ను పరామర్శించిన శివశంకర్‌
ఆపరేషన్‌ జరిగి విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చందు జనార్దన్‌ను సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకరరావు శుక్రవారం పరామర్శించారు. జర్నలిస్టుల సమస్యలపై దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న చందు జనార్ధన్‌ తనకు మంచి మిత్రుడని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా జొన్న శివశంకర్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించాలని జనార్ధన్‌ ఆకాంక్షించారు.

ప్రజాశక్తి – తాడేపల్లి రూరల్‌ : నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికై, పేదలకు అండగా ఉండేది ఎర్రజెండా మాత్రమేనని, ఎర్ర జెండాను గెలిపించాలని సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి డి.వెంకటరెడ్డి కోరారు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మెల్లంపూడి, గుండిమెడ గ్రామాల్లో సిపిఎం శ్రేణులు ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం చేశారు. వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశానికి పెను ప్రమాదంగా మారిన బిజెపి, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికలో ఓడించాలన్నారు. బిజెపి పాలనలో ప్రజలపై అనేక భారాలు వేసిందని, భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా నియంతత్వ పరిపాలన సాగిస్తూ దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు దోచిపెట్టిందని అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి పేదల పొట్ట కొట్టిందని విమర్శించారు. 44 కార్మిక చట్టాలను కాలరాసే విధంగా నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చి వేసిందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర పన్నారని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపిని, దాతితో జతకట్టిన టిడిపి, జనసేనను, తొత్తుగా వ్యవహరిస్తున్న నిరంకుశ వైసిపిని ఓడించాలని కోరారు. మతోన్మాద బిజెపిని వెనక్కి కొట్టేందుకు, దేశాన్ని రక్షించుకునేందుకు ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా నాయకులు బి.ముత్యాలరావు మాట్లాడుతూ పారిశ్రామిక రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తున్న బిజెపి కూటమి పార్టీలకు ఓటు అనే ఆయుధంతో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. మంగళగిరి శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న జొన్న శివశంకరరావుకు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన, గుంటూరు పార్లమెంట్‌ అభ్యర్థి జంగాల అజరు కుమార్‌కు కంకి కొడవలి గుర్తు పైన ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి.కృష్ణ, కె.సాంబశివరావు, బి.సంసోను, అనూష, బాల కుమారి, దుర్గా ప్రసాద్‌ పాల్గొన్నారు.

గుంటూరులో అజరుకుమార్‌ ప్రచారం
ప్రజాశక్తి-గుంటూరు :
ఇండియా వేదిక బలపరిచిన గుంటూరు పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి జంగాల అజరుకుమార్‌ గెలుపును కోరుతూ శుక్రవారం బ్రాడీపేటలో, పొత్తూరువారి తోటలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రజలపై భారాలు మోపుతున్న బిజెపిని, దానిని బలపరుస్తున్న పార్టీలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నగర కార్యదర్శులు కె.నళినీకాంత్‌, కె.మాల్యాద్రి, సిపిఐ నాయకులు మేడా హనుమంతరావు, ఎ.అరుణ్‌కుమార్‌, పి.శివాజీ, జి.సురేష్‌బాబు, సిపిఎం నాయకులు అంకమ్మరావు, దుర్గారావు పాల్గొన్నారు.

➡️