ఓట్ల లెక్కింపులో ఆర్‌ఓల నిర్ణయమే అంతిమం

May 20,2024 23:27

సమీక్షలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్‌ 4న నిర్వహించనున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు కీలక పాత్ర పోషించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ శ్రీకేశ్‌ బి లత్కర్‌ బాలజీరావు అన్నారు. ఓట్ల లెక్కింపు ముందస్తు ఏర్పాట్లపై పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులతో కలెక్టర్‌ సోమవారం సమీక్షించారు. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ ఏ.శ్యాంప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రిటర్నింగ్‌ అధికారులు ఆయా నియోజకవర్గాలలో శాంతి బద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. కౌంటింగ్‌ సమయంలో రిటర్నింగ్‌ అధికారి ఏ నిర్ణయం తీసుకుంటారో అదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. కౌంటింగ్‌ సంబంధించిన పలు విషయాలను ఎన్నికల కమిషన్‌ పుస్తకం రూపంలో ముద్రించిందని, రిటర్నింగ్‌ అధికారులంతా క్షుణ్ణంగా చదివాలని సూచించారు. ఫలితాలు ప్రకటించిన అనంతరం సంబంధిత ఈవిఎంలు, వివి ప్యాట్‌లు సక్రమంగా పటిష్టమైన బందోబస్తు ద్వారా స్ట్రాంగ్‌ రూమ్‌లోకి చేర్చాలని, అందుకు అవసరమైన సిబ్బందిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని చెప్పారు. 4 వ తేదీన అబ్జర్వర్‌, పోటీలో ఉన్న వివిధ పార్టీలు ప్రతినిధుల సమక్షంలో సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారుల ఆధ్వర్యంలో స్ట్రాంగ్‌ రూమ్‌ తెరవాలని, అందుకు అవసరమైన చురుకైన కౌంటింగ్‌ సిబ్బందిని నియమించుకోవాలి, పార్లమెంట్‌కి సంబంధించిన కౌంటింగ్‌ సిబ్బంది ప్రత్యేకంగా ఉండాలని నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్‌ సిబ్బంది ప్రత్యేకంగా ఉండాలని, కౌంటింగ్‌ సిబ్బందికి కూడా ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాలు ఆయా నియోజకవర్గాల స్థాయిలో నిర్వహించాలని తెలిపారు. కౌంటింగ్‌లో పాల్గొనే ప్రతి ఒక్క సిబ్బందికి కచ్చితంగా గుర్తింపు కార్డు ఉండాలని, వివిధ రాజకీయ పార్టీల పార్టీ ఏజెంట్లు కూడా కచ్చితంగా గుర్తింపు కార్డు ఉండాలని తెలిపారు. డేటా ఎంట్రీకి చురుకైన సిబ్బందిని నియమించుకోవాలన్నారు. కార్యక్రమంలో పెదకూరపాడు రిటర్నింగ్‌ అధికారి శ్రీరాములు, సత్తెనపల్లి రిటర్నింగ్‌ అధికారి మురళీ కష్ణ, చిలకలూరిపేట రిటర్నింగ్‌ అధికారి నారదముని, వినుకొండ రిటర్నింగ్‌ అధికారి సుబ్బారావు పాల్గొన్నారు.

➡️