ఎర్రజెండాతోనే మన్యం అభివృద్ధి

May 12,2024 21:29

ఎర్రజెండాతోనే పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధి సాధ్యమౌతుంది. 1960 దశకం నుంచి చేసిన అనేక పోరాటాలు, ఫలితాలే ఇందుకు తార్కాణంగా చెప్పుకోవచ్చు. గిరిజన రైతాంగ దోపిడీని ఎదురించడం మొదలుకుని గిరిజనులు, రైతుల కోసం ఇక్కడి నుంచే కమ్యూనిస్టు ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. అటు పార్లమెంట్‌, ఇటు అసెంబ్లీల్లో చర్చనీయాంశమై చట్టరూపం దాల్చాయి. అవే చట్టాలను గడిచిన పదేళ్లలో బిజెపి కాలరాస్తోంది. బిజెపికి, టిడిపి, వైసిపి వంతపాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా వేదిక బలపర్చిన సిపిఎం, కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయంతోనే చట్టాల పరిరక్షణ సాధ్యమౌతుంది. ఇందుకనుగుణంగా కురుపాం సిపిఎం అసెంబ్లీ అభ్యర్థి మండంగి రమణను, అరకు సిపిఎం ఎంపీగా పాచిపెంట అప్పలనర్సను గెలిపించాలంటూ మాజీ కేంద్ర మ్తంరి వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌ సైతం ఇటీవల పిలుపునిచ్చారు.

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : పార్వతీపురం గిరిజన ప్రాంతంలో 1960లోనే కమ్యూనిస్టు పార్టీకి బీజాలు పడ్డాయి. 1970లో కొన్ని కారణాలవల్ల సిపిఎం ఇబ్బందులు ఎదుర్కొన్నా 1980నాటికి పడిలేచిన కెరటంలా పార్టీ పునర్జీవం పోసుకుంది. దీంతో, గిరిజన ప్రాంతంలో ఉద్యమాలు క్రమంగా ఉపందుకున్నాయి. ఈ క్రమంలోనే 2004 ఎన్నికల్లో నాగూరు కేంద్రంగా ఉండే నేటి కురుపాం నియోజకవర్గం ప్రజానీకం సిపిఎం పార్టీకి పట్టం కట్టి ఎమ్మెల్యే స్థానాన్ని కల్పించారు. ఆ సందర్భంగా అసెంబ్లీలో పట్టుబట్టి పోరాడిందే నేడు అసంపూర్తిగా వున్న పూర్ణపాడు – లాబేసు వంతెన. అప్పటి వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం దీన్ని మంజూరు చేసింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన టిడిపి, వైసిపిలకు చిత్తశుద్ధి లేకపోవడంతో అసంపూర్తిగా మిగిలిపోయింది. దీంతో, నేటికీ విద్య, వైద్యం, నిత్యవసర సరుకుల కోసం నాగావళి నదిపై ప్రమాదపుటంచున్న పడవ ప్రయాణం చేయాల్సిన దుస్థితి దాపురిస్తోంది. సాగు భూములపై గిరిజనులకు హక్కు కల్పించాలన్న దేశవ్యాప్త డిమాండ్‌ను సిపిఎం పార్వతీపురం మన్యం నుంచే ప్రారంభించింది. ఈ క్రమంలో ఏర్పడిందే 2005 అటవీహక్కు చట్టం. 2004 కమ్యూనిస్టుల మద్ధతుతో ఏర్పడిన యుపిఎ-1 ఈ చట్టాన్ని రూపొందించి, దాని ప్రకారం గరిష్టంగా 10ఎకరాల భూములకు సాగుపట్టాలిచ్చేందుకు ముందుకు వచ్చింది. మన్యం జిల్లాలో వేలాది ఎకరాల పోడు భూములకు ప్రభుత్వం ఆర్‌ఒఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చింది. ఆ తరువాత వచ్చిన టిడిపి, వైసిపిలకు చిత్తశుద్ధి కొరవడడంతో ఇంకా వేలాది గిరిజన కుటుంబాలు సాగు పట్టాలకు నోచుకోలేదు. ఏజెన్సీకి ఆనుకుని అత్యధిక గిరిజనులు నివాసం ఉంటున్న గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాలో చేర్చాలని దశాబ్ధాలు తరబడి పోడుతోంది. 2005 ఏప్రిల్‌లో సిపిఎం ఆధ్వర్యాన చేపట్టిన తోటపల్లి నిర్వాసితుల పోరాటం దేశానికే ఆదర్శంగా నిలిచింది. అప్పటి ప్రభుత్వం 5ముంపు గ్రామాలుగా ప్రకటిస్తే సిపిఎం చేసిన సుదీర్ఘపోరాటంతో 24గ్రామాలకు ముంపు సమస్య ఉన్నటుగా గుర్తించి మెరుగైన నష్టపరిహారం చెల్లించారు. ప్రస్తుతం అనేక ప్రాజెక్టుల నిర్వాసిత గ్రామాల్లో 18ఏళ్ల నిండినవారందరికీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందుతుందంటే నాడు సిపిఎం ఆధ్వర్యాన తోటపల్లిలో చేపట్టిన ఉద్యమమే కారణం. జలాశయానికి వందమీటర్ల దూరంలోవున్న గ్రామాలను ముంపు ప్రాంతంగా గుర్తించే జీవో కూడా అప్పుడే రూపకల్పన జరిగింది. పెద్దగెడ్డ ముంపు గ్రామాలను 1నుంచి 5రెట్లకు పెరిగేలా చేయడంతోపాటు నిర్వాసితులందరికీ నాయ్యం జరిగే విధంగా పోరాడింది. ఇప్పటికీ కొంతమందికి పూర్తి న్యాయం జరగకపోవడంతో పోరాటం కొనసాగిస్తోంది. ప్రస్తుతం కురుపాం గిరిజన ఇంజినీరింగ్‌ కాలేజీ భూ నిర్వసితులకు న్యాయం చేయాలని పోరాడుతోంది. కొమరాడ మండలం కోటిపాం ప్రాంతంలో కాలుష్యకారక థర్మల్‌ విద్యుత్‌ కర్మాగారానికి వ్యతిరేకంగా పోరాడి నిలువరించగలిగింది. నాడు ఇందుకోసం సేకరించిన భూములను రైతులకు తిరిగి ఇవ్వాలనే డిమాండ్‌తో పోరాడుతోంది. గిరిజనులు సాగుచేసుకుంటున్న పాచిపెంట మండలం కుడుమూరులోని మొకాసా భూములను గిరిజనేతరులు ఆక్రమించుకోవడాన్ని నిలువరించింది. దీంతో, ప్రస్తుతం ఆయా భూములన్నీ గిరిజనుల ఆదీనంలో వున్నప్పటికీ పాలకులు నేటికీ ఆక్రమణ దారులకు కొమ్ముకాస్తునే ఉన్నారు. గరుగుబిల్లి మండలం పోలినాయుడు వలసలో 1200ఎకరాల ఇనాం భూములను పెత్తదారులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడంతో పెద్దఎత్తున పోరాడింది. మెంటాడ మండలం గిరిజనుల సాగులోవున్న వందలాది ఎకరాలను గిరిజనేతర పెత్తందారులు ఆక్రమిత చర్యలను అడ్డుకుని పట్టాల కోసం పోరాడుతోంది. సిపిఎం పోరాటంతో సాలూరు శిఖపరువులో అక్రమంగా తలపెట్టిన మాంగనీస్‌ తవ్వకాలు, మండలంలోని తామరకొండ, పార్వతీపురం మండలంలోని బోడికొండపై గ్రానైట్‌ తవ్వకాలు నిలిపివేయాలని గిరిజనులు, గిరిజనేతరులను పెద్ద ఎత్తున కదిలించి పోరాడింది. సవర భాషా విద్యావాలంటీర్లను కొనసాగించాలని, జీవో నెంబర్‌ 3ను పునరుద్ధరించి గిరిజన ప్రాంతంలో 100శాతం ఉద్యోగాలను గిరిజనులతో భర్తీ చేయాలని పోరాడుతోంది. రేషనలైజేషన్‌ పేరుతో 3కిలో మీటర్ల పరిధిలోవున్న 30మంది విద్యార్థుల కన్నా తక్కువగా ఉన్న సూళ్లను మూసివేయాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా మన్యంలో సిపిఎం తిప్పి కొట్టింది. పార్వతీపురంలోని వెంకటే శ్వర డిగ్రీ కాలేజీని ప్రభుత్వరంగంలోకి విలీనం చేయాలన్న డిమాండ్‌తో సిపిఎం చేసిన సుదీర్ఘపోరాటం ఫలించింది. నేడు ఆ కాలేజీయే పేద, గిరిజనులకు చదువుల తల్లిగా మారింది. అరకు అనంతగిరి ప్రాంతంలో బాక్జైట్‌ తవ్వకాలను అడ్డుకోవడంతో విజయనగరం జిల్లా ఎస్‌.కోట గిరిజన ప్రాంతానికి ఆనుకునివున్న జిందాల్‌ అల్యూమినా కంపెనీ నిర్మాణం జరగలేదు. దీంతో, అప్పట్లో భూములు కోల్పోయిన గిరిజనులకు తిరిగి అప్పగించాలని సిపిఎం పోరాడుతోంది. ఇలా ఎన్నో సమస్యలపై పోరాడింది. విజయాలు సాధిస్తోంది. మరిన్ని సమస్యల పరిష్కారానికి పోరాడుతునే ఉంది. తాజా ఎన్నికల్లో అరకు పార్లమెంట్‌ స్థానం, దాని పరిధిలోవున్న కురుపాం నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థులు పోటీకి దిగడంతో ఆ పార్టీ చరిత్ర, పోరాటలు జనంలో చర్చనీయాశంగా మారుతున్నాయి.

➡️