అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు అన్ని చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్‌

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : జిల్లాలో వివిధ మున్సిపాలిటీలలో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ మంగళవారం కలెక్టర్‌ బంగ్లా నుండి మున్సిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలు సమీక్షించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ … గతంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిన భవనాల్లో సచివాలయాలు ఉంటే, వాటిని అనువైన ప్రదేశానికి షిఫ్ట్‌ చేయడానికి చర్యలు తీసుకోవాలని, వాటిని అన్నా క్యాంటీన్‌ కు వినియోగించుకునేందుకు అవసరమైన ఫర్నిచర్‌, విద్యుత్‌, టాయిలెట్స్‌ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు ఆర్థిక అంచనాలు రూపొందించి వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మూడు స్తంభాల సెంటర్లో గతంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ భవనంలో సచివాలయం ఏర్పాటు చేశారని, దానిని షిఫ్ట్‌ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, కమిషనర్‌ బాపిరాజు తెలుపగా, దానిలో అన్న క్యాంటీన్‌ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌ ఆదేశించారు. గుడివాడలో గతంలో రెండు అన్న క్యాంటీన్లు ఉండేవని, ఒకదానిలో సచివాలయం ఏర్పాటై ఉందని, దాన్ని వేరేచోటికి షిఫ్ట్‌ చేయటకు చర్యలు తీసుకుంటున్నామని, ఉన్న వాటిని అన్న క్యాంటీన్‌ ఏర్పాటుకు అనువుగా అవసరమైన మరమ్మత్తులు చేపట్టకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కమిషనర్‌ బాలసుబ్రమణ్యం కలెక్టర్కు వివరించగా, అన్న క్యాంటీన్‌ ఏర్పాటుకు అవసరమైన ఫర్నిచర్‌ విద్యుత్‌ మరమ్మతులు చేపట్టడానికి అవసరమైన ప్రతిపాదనలు వెంటనే పంపాలని కలెక్టర్‌ ఆదేశించారు. పెడన, ఉయ్యూరు మున్సిపాలిటీలలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని, అవసరమైన ప్రతిపాదన పంపాలని కమిషనర్లను కలెక్టర్‌ ఆదేశించారు. తాడిగడప మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడినందున అన్న క్యాంటీన్‌ లేదని, ప్రభుత్వం అన్న క్యాంటీన్‌ మంజూరు చేసిన అవసరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ వెంకటేశ్వరరావు కలెక్టరుకు తెలిపారు.

➡️